నీ ఉడత ఊపులకు ఎవరూ భయపడరు
ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి
తిరుగులేని మెజార్టీతో గెలవబోతున్నాం
చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు : కూటమి కార్యకర్తల జోలికొస్తే తాటతీసి పంపిస్తారని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ఆయన మంగళవారం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నియోజవర్గంలో అవాకులు, చవాకులు పేలుతున్న వైసీపీ చెంచాలు తమజోలికి రావద్దని హితవుపలికారు. చిలకలూరిపేట గడ్డ తన అడ్డ అన్న కావేటి మనోహర్ నాయుడు ఉడుత ఊపులకు భయపడే పనే లేదని, అసలు అలాంటి వారికి కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరమే లేదన్నారు. కనీసం నియోజ కవర్గం సరిహద్దులు తెలియని వ్యక్తులు వచ్చి ఇవాళ అది చేస్తాం, ఇది చేస్తామంటే నమ్మడానికి ఇక్కడి ప్రజలు ఎంతమాత్రం సిద్ధంగా లేరన్నారు. 25 ఏళ్లుగా నియోజకవర్గంతో సంబంధాలు ఉన్నాయి. ఇది ప్రత్తిపాటి బ్రాండ్…నిన్న గాక మొన్న వచ్చాడో లేదో చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.
చిలకలూరిపేట వాసులను బెదిరించేంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌కే ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడిన సందర్భంలో వాళ్ల ఆటలు సాగే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యమంత్రిగా జగన్, మంత్రిగా విడదల రజిని ఐదేళ్లలో ఏం చేశారో చెప్పిన తర్వాతనే మనోహర్ నాయుడు ఇక్కడ ఓటు అడగాలని డిమాండ్ చేశారు. గత ఎన్నిక ల్లో ఎందుకు తప్పు చేశామా అని ఇవాళ నామినేషన్‌కు వచ్చిన ప్రజలు చూపెట్టారని అన్నారు. ఇక్కడ అరాచకాలు చేయాలంటే చిలకలూరిపేట ప్రజలు సహించరని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో చిలకలూరిపేటలో అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతామని స్పష్టం చేశారు. చిలక లూరిపేట జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ మాట్లాడుతూ ప్రత్తిపాటిని, తెదేపా కార్యకర్తలను అంతుచూస్తానని మనోహర్ నాయుడు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.. అందు కు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుదన్నారు. ఇక్కడి మంత్రి గుంటూరుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని కోరారు.