-మూడురోజుల్లో అందుబాటులో ఉంచాలి
-లేకుంటే ఆదిలాబాద్ వ్యాప్తంగా ఆందోళనలు
-బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి జోగురామన్న
హైదరాబాద్: మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, ఖానాపూర్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి జాన్సన్ నాయక్ తెలంగాణ భవన్‌లో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. జోగు రామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జ్ చేయడం అమానుషమన్నారు. రెండు మూడురోజుల్లో రైతులు అడిగిన విత్తనాలు అందుబాటులో ఉంచకపోతే ఆదిలాబాద్ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ అప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లో బిజీగా ఉన్నాడు ..ఇప్పుడు అధికార చిహ్నాలు మార్చడంలో బిజీ గా ఉన్నారని ఎద్దేవాచేశారు. వ్యవసాయ మంత్రి రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని అబద్దాలు మాట్లాడుతున్నారు. రైతులు మళ్లీ కమిషన్ ఏజెంట్లను ఆశ్రయించడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు.
రైతు భరోసా పంటలు వేసిన తర్వాత ఇస్తామని వ్యవసాయ మంత్రి చెప్పడం సిగ్గు చేటు. మంత్రి జూపల్లికి తన శాఖలో ఏం జరుగుతుందో తెలియకపోవడం శోచనీయం. కేసీఆర్ ఆనవాళ్లను తొలగిం చడం కాదు…రైతు సమస్యలపై దృష్టిపెట్టాలని హితవుపలికారు. వర్షాకాలం సాగునీటి విడుదల మీద ప్రభుత్వానికి ఓ కార్యాచరణ లేదు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ రైతుల పట్ల చూపిన శ్రద్ధలో రేవంత్ పది పైసలు పెట్టినా ఇన్ని సమస్యలు వచ్చేవి కావు. రైతుల సమస్యలపై సీఎం రేవంత్ ఎందుకు నోరు మెదపరు? రైతు భరోసా ఎప్పటినుంచి వేస్తారో సీఎం రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు.