ఎంపి లావు, ఎమ్మెల్యేగా జివి ఆంజనేయుల గెలుపే మా ధ్యేయం

గుంటూరులో వినుకొండవాసుల ప్రతిజ్ఞ

గుంటూరు, మహానాడు న్యూస్: రాజకీయం అంటే తొడలు కొట్టడాలు బూతులు తిట్టడాలు కాదని పాజిటివ్ క్యాంపెయిన్ ద్వారా ప్రజాభిమానం పొంది ఎన్నికల్లో విజయం సాధించవచ్చని నర్సరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. సోమవారం గుంటూరులో జరిగిన వినుకొండ వాసుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి మహానాడు మీడియా సంస్థల ఎండి బోడేపూడి వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపి శ్రీ కృష్ణదేవరాయలు మాట్లాడుతూ రాజకీయం ఇలానే చెయ్యాలనే సూత్రీకరణలు ఏమీలేవని రాజకీయం సానుకూల దృక్పధంతో అభివృద్దే ధ్యేయంగా ప్రజలను ప్రభావితం చేస్తూ కూడా చేయొచ్చని, అందుకు తన విజయమే నిదర్శనమన్నారు. వినుకొండ నుంచి గుంటూరు వలస వచ్చి స్థిర పడిన వినుకొండ వాసుల ఆత్మీయ సమావేశంలో తాను పాల్గొనడం సంతోషమని, అయితే ఇలా గుంటూరే కాకుండా రాష్ట్రంలో దేశంలో అనేక ప్రాంతాలకు వినుకొండ నుంచి ప్రజలు ఎక్కువగా వలస వెళ్లారని ఇది తనకు బాధకలిగించిందన్నారు.

వినుకొండలోనే మంచి అభివృద్ది అవకాశాలు ఉంటే ప్రజలు వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళాల్సిన అవసరం ఉండదని, ఆ విధంగా వినుకొండను అభివృద్ది పధంలో తీర్చిదిద్దాలనేది తన ఆకాంక్షని ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. అనంతరం ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా హాజరైన వినుకొండ మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో అనుభవజ్ఞుడైన, అభివృద్ది ప్రదాత అయిన చంద్రబాబుని ప్రజలు గెలిపిస్తే అమరావతి రాజధాని డెవలప్మెంట్ తో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ తో సహా అనేక కార్యక్రమాల్లో రాష్ట్రాన్ని చంద్రబాబు నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారన్నారు.

ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ అంటూ మాయమాటలు చెప్పి కల్లబొల్లి ఏడుపులు ఏడిస్తే ప్రజలు నమ్మి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని విమర్శల వర్షం కురిపించారు.చంద్రబాబుతో సహా అనేకమంది నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి సాక్ష్యాలు చూపించలేక కోర్టులతో తిట్లు తిన్న వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. అలాగే వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు అనే దురహంకారి, కబ్జాకోరు, సంస్కార హీనుడు ఎమ్మెల్యేగా ఉన్నాడని, అతని అరాచకాల కారణంగా ఇతర పార్టీల నేతలు, నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. వినుకొండ వాసులు ఈసారి ఎంపి శ్రీకృష్ణదేవరాయలును తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. తద్వారా పల్నాడు వాసుల దాహార్తిని తీర్చే వరికెపూడిసెల ప్రాజెక్ట్, పల్నాడు వాటర్ గ్రిడ్ ఈరెండు పూర్తి చేసి జన్మభూమి రుణం తీర్చుకోవడానికి కృషిచేస్తానన్నారు.

సభాధ్యక్షత వహించిన మహానాడు మీడియా సంస్థల ఎండి బోడేపూడి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గం అభివృద్ది కోసం ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేగా జివి ఆంజనేయులును గెలిపించాల్సిన ఆవశ్యకత వినుకొండవాసులందరిపై ఉందన్నారు. అందుకోసం తాము ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్దం చేసుకున్నామని ఆ ప్రకారం గుంటూరులో స్థిరపడిన వినుకొండవాసులు అందరూ వినుకొండ నియోజకవర్గం ప్రజలను మోటివేట్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.

ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు క్యాంపు కార్యాలయం ప్రాంగణంలో జరిగిన వినుకొండవాసుల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు,టిడిపి బిసి నేత నిమ్మల శేషయ్య, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లాల అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జనసేన నేత డేగల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి, టిడిపి వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.