-అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
-HUJ-TUWJ నేతలు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అమానుషంగా పోలీసులు లాక్కెళ్లడం అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(HUJ) అధ్యక్షులు శిగ శంకర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజులు ఘటనపై స్పందించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనను కవర్ చేసేందుకు వెళ్లిన జీటీవీ ప్రతినిధి చరణ్ పై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అన్నారు. చొక్కా పట్టుకుని లాక్కెళ్లడమే కాకుండా, కెమెరాలను తీయొద్దంటూ బెదిరించడం దారుణమన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ జర్నలిస్టుల పట్ల దాడులకు పాల్పడడం అడప దడప జరుగుతూనే ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన పోలీసుల పట్ల చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా?: బి.ఆర్.ఎస్ అధికార ప్రతినిధి డా. ఎర్రోళ్ల శ్రీనివాస్
డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా?mమాది కంచెల ప్రభుత్వం కాదు, ఆంక్షల ప్రభుత్వం కాదని చెప్పిన కాంగ్రెస్ నాయకులు జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్నారు.
గత రెండు మూడు రోజులుగా బాష్ప వాయువులతో, పోలీస్ పాహారాలో ఉస్మానియా యూనివర్సిటీ మళ్లీ సమైక్య రాష్ట్రాన్ని తలపిస్తుంది. అరెస్టు చేసిన జర్నలిస్టులను, విద్యార్థులను, నిరుద్యోగులను మరియు విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలి. లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి బి.ఆర్.ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటూ వారి తరపున పోరాటం చేస్తుంది.