Mahanaadu-Logo-PNG-Large

ప్రజాసేవే పరమావధిగా దర్శికి అభివృద్ధిని పరిచయం చేద్దాం..

– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భవిష్యత్తుకు లోకేష్ భరోసా
– లోకేష్ ను కలిసి దర్శి ప్రగతిపై చర్చించిన టీడీపీ ఇన్‌చార్జి

దర్శి, మహానాడు: ఓడిపోయానని కుంగిపోవద్దు. ఎక్కడైతే మనం ఓటమిని చవిచూశామో అక్కడే గెలిచిచూపిద్దాం.. ఇందుకు నన్నే స్ఫూర్తిగా తీసుకుని పనిచేయండి. మీ రాజకీయ భవిష్యత్తుకు నాది భరోసా. మీరు దర్శి నియోజకవర్గానికి అభివృద్ధిని పరిచయం చేసి చూపండి… అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దర్శి టీడీపీ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి భరోసానిచ్చారు. సోమవారం ఆమె నారా లోకేష్ ను వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

దర్శి అభివృద్ధికి ప్రణాళిక
దర్శి అభివృద్ధి ప్రణాళిక పై ఒక అంచనా నివేదిక అందించారు. ఆమెతోపాటు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, డాక్టర్ వెంకటేశ్వరరావు, రమేష్ లు దర్శి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పై లోకేష్ తో చర్చించారు. దర్శి ప్రాంతంలో మంచినీటి సమస్య అధికంగా ఉందని..శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణ నిమిత్తం దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ వంటి జోన్ ఏర్పాటు మంచిదని లోకేష్ దృష్టికి తెచ్చారు.

మౌలిక సదుపాయాల కల్పనపై సర్వే
దర్శి పట్టణంలో అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పన, రోడ్లు, డ్రెయినేజీ విస్తరణ, ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి, డిగ్రీ కాలేజీ శాశ్వత భవనాలు, సాగర్ కాలువల మరమ్మతులు, అమృత పథకం ద్వారా ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన నీటి పంపిణీ తదితర అంశాలపై సర్వే అంచనాలను గొట్టిపాటి మంత్రి లోకేష్ దృష్టి కి తీసుకెళ్ళి చర్చించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్నికల తర్వాత కూడా ఒక మహిళా డాక్టర్ గా, మహిళా నాయకురాలిగా దర్శి నియోజకవర్గంలో చురుగ్గా పనిచేస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. అతి తక్కువ కాలంలో ప్రజల అభిమానాన్ని చూరగొని టీడీపీ పార్టీ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.

సమస్యల పరిష్కారానికి లోకేష్‌ హామీ
కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్‌ సారథ్యంలో ప్రజా సంక్షేమ పథకాలు దిగ్విజయంగా సాగుతున్నాయన్నారు. రెండు నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం అనేక అద్భుతాలు చేసిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అందరూ పనిచేయాలని ఆమేరకు ముందుకు పోవాలని లక్ష్మి కి నారా లోకేష్ భరోసానిచ్చారు. కూటమి పక్ష నేతగా ఇకనుంచి ప్రభుత్వ అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి దర్శి నియోజకవర్గ అభివృద్ధి ని తీర్చిదిద్దాలన్నారు.

ఎన్నికలకు ముందు దర్శి నియోజకవర్గంలో తాను నిర్వహించిన యువగళం పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని లోకేష్ హామీనిచ్చారు. ఈమేరకు లోకేష్ కు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కుటుంబం కృతజ్ఞతలు తెలిపి.. తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు.