తెలుగు భాషను పరిరక్షించుకుందాం

రాష్ట్ర బీసీ, ఈడబ్య్లూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి
శాఖామాత్యులు ఎస్.సవిత

అమరావతి : మాతృ భాషతోనే మానవ జాతి మనుగడ సాధ్యమవుతుందని, తెలుగు భాషను తెలుగు ప్రజలంతా ఐక్యంగా పరిరక్షించుకుందామని రాష్ట్ర బీసీ, ఈడబ్య్లూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖా మాత్యులు ఎస్.సవిత పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తో కలిసి గురువారం తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాలు వేసి తెలుగు భాషాదినోత్సవం జరుపుకున్నారు. తెలుగు భాషోద్యమ నాయకుడు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, తెలుగు భాషోదినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన గిడుగు వెంకట రామ్మూర్తి సేవలను గౌరవిస్తూ…ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. వీరేశలింగం పంతులుగారు, గురజాడ అప్పారావు గారు కూడా తెలుగు భాష అభివృద్ధికి విశేష కృషి చేశారు.

దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయులు అంటే… ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా తెలుగు భాషను ఐరోపా దేశస్తులు కొనియాడుతుంటారన్నారు. ఎంతో విశిష్టత కలిగిన తెలుగు భాష ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. భావ వ్యక్తీకరణ మాతృ భాషతోనే సాధ్యమని, కష్టాన్ని… దు:ఖాన్ని.. ఆనందాన్ని… అమ్మ భాషలోనే పంచుకుంటేనే తీవ్రత తెలుస్తుందన్నారు. తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపైనా ఉందని, చెయ్యేతి జై కొట్టు తెలుగోడా… గతమెంతో ఘనకీర్తీ గలవోడా…అని నినదించిన వేములపల్లి శ్రీకృష్ణ బాటలో నడుద్దామని మంత్రి పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.