Mahanaadu-Logo-PNG-Large

ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం

పట్టిసీమ లేకుంటే వలసలే గతి
నీటి వనరుల వృథా గత పాలకుల వైఫల్యం
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు

విజయవాడ, మహానాడు:  రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి, ప్రజల త్రాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు అన్నారు. ​బుధవారం ప్ర‌కాశం బ్యారేజీ కృష్ణా పశ్చిమ డెల్టా హెడ్ రెగ్యులేట‌ర్ వ‌ద్ద కాలువ‌లకు నీటిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు విడుదల చేశారు. అంతకు ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించి పసుపు, కుంకుమలు సమర్పించి నీటిని విడుదల చేశారు.

ఈ సందర్బంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ….

ఈ రోజు ప్రకాశం బ్యారేజీ నుండి కృష్ణ తూర్పు డెల్టా , కృష్ణ పశ్చిమ డెల్టా నుండి త్రాగు, సాగు నీరందించడం ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉందన్నారు. పట్టిసీమ గోదావరి జలాలు కృష్ణానదికి చేరకుంటే ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి దాపురించేదన్నారు. పంటలు పండించడంతో పాటు 40 లక్షల మంది దాహార్తిని తీరుస్తున్నామంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనీకత, ముందుచూపే అన్నారు.

బ్రిటిష్ పాలనకంటే గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన రైతులకు అత్యంత దుర్భర పరిస్థితి కలిగిందన్నారు. బ్రిటిష్ వారు గోదావరి, కృష్ణా ప్రాంతాల ప్రజలపై చూపిన ప్రేమ, మమకారం ప్రజల ఓట్లతో గెలిచిన గత ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవడానికి నాలుగు ఐదు సంవత్సరాలు పడుతుందని భావించి ప్రతి సంవత్సరం మూడు వేల టియంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతోందని, ప్రాజెక్ట్ పూర్తి అయ్యే వరకు కనీసం గోదావరి జలాలు కృష్ణాకు మరలుస్తామని భావించి రూ. 1300 కోట్ల తో పట్టి సీమ ప్రారంభిస్తే ఆ రోజు అసెంబ్లీ లో వైయస్.జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకించారన్నారు. పట్టిసీమకు రూ. 1300 కోట్లు పెడితే 2015 నుండి 2019 వరకు నాలుగు సంవత్సరాల్లోనే 300 టీయంసీ ల నీరు కృష్ణా డెల్టాకు ఇచ్చి 50 వేల కోట్ల సంపద రైతులు సృష్టించేటట్లు చేశారన్నారు.

పట్టిసీమ లేకపోతే ఈ రోజు కృష్ణా డెల్టా ప్రజలు వలస పోవడమే జరిగేదన్నారు. మనకు ప్రత్యామ్నాయంగా పులిచింతల ఉందన్నారు పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ముప్పైన్నర టీయంసీల నీటిని నిల్వ చేసుకొని జులై నెలలో కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తారు. ప్రస్తుతం అర టీయంసీ నీరు కూడా లేదని, అంటే ఉన్న నీటిని సరిగా మేనేజ్మెంట్ చేయకుండా సముద్రంలో వృధాగా వదిలి వేయడం కృష్ణా డెల్టా ప్రజలకు ద్రోహం చేయడమేనన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి, దానిని ఆఖరి పొలం వరకు తీసుకువెళ్లాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గత నాలుగు సంవత్సరాల నుండి మెయిన్టేనెన్స్ లేకపోవడం వల్ల ఎత్తిపోతలను యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపడుతున్నట్లు తెలిపారు.

పట్టిసీమతో పాటు తాడిపూడి , పురుషోత్తపట్నం , పుష్కరల మరమ్మత్తు , అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోదావరి జలాలు ఈస్ట్ , వెస్ట్ డెల్టాల్లో పరవళ్ళు త్రొక్కుతుండడం ముఖ్యమంత్రి దూరదృష్టికి నిదర్శనం అన్నారు. ప్రకాశం బ్యారేజీ నుండి కృష్ణా పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగింది. రాష్ట్రానికి , రైతాంగానికి జగన్ మోహన్ రెడ్డి చేసిన ద్రోహానికి భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తి రాజకీయానికి, ప్రజాస్వామ్యానికి అర్హుడు కాదనే విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు.

​ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ నారాయణ రెడ్డి, ఎస్.ఈ ఇరిగేషన్ ఉమామహేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లిఖార్జున, రాష్ట్ర అపెక్స్ మాజీ సభ్యులు ఆళ్ళ గోపాలకృష్ణ , కృష్ణా – పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ ఛైర్మన్ మైనేని మురళి కృష్ణ, కృష్ణా – తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ ఛైర్మన్ గుప్తా శివరామకృష్ణ , టిడిపి మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కర్త నందం అబద్దయ్య , పరిశీలకులు వెంకట సత్యనారాయణ, టౌన్ ప్రెసిడెంట్ వెంకట రావు, నీటి పారుదల శాఖాధికారులు పాల్గొన్నారు.