– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి
విజయవాడ: మహిళలకు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య జీవితం ఎంతో కీలకమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పీరియడ్స్ ఆగిపోయిన క్రమంలో ఒత్తిళ్ళకు లోనవుతారని, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వలన ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడతారని పేర్కొన్నారు. వాటిని అధిగమించేందుకు వైద్యుల సలహాలు సూచనలు పాటించాల్సిన అవసరముందన్నారు.
విజయవాడ మొనోపాజ్ సొసైటీ, విజయవాడ అబ్బ్స్టేట్రిక్స్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎంబివీకే భవన్ లో ఎస్.జే ఇమ్ స్కాన్ 2024 ను నిర్వహించారు. శని ఆదివారాలు రెండు రోజులపాటు జరిగిన సమావేశాలలో పలు అంశాలపై చర్చలు జరిగాయి. కార్యక్రమానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ నాయకురాలు గద్దె అనురాధ హజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెలసరి ఆగిపోయే సమయంలో మహిళలు ఆరోగ్య పరంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. శరీరంలో హర్మోన్లు తగ్గడం వలన ఒత్తిడికి లోనవుతారని, గుండెకు సంబందించిన సమస్యలు కూడా వస్తాయన్నారు. అటువంటి సమయంలో వైద్యుల సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా మొనోపాజ్ దశను అధిగమించేందుకు ఉపయోగపడతాయన్నారు.
దీనిపై అవగాహన కల్పించేందుకు మొనోపాజ్ సొసైటీ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని చెప్పారు. అయితే గ్రామీణ స్థాయిలో మహిళలకు ఈ దశపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వంపై కూడా బాధ్యత ఉంటుందని, మహిళల కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరముందన్నారు.