శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేత

సాగర్ జలాశయానికి పెరిగిన వరద

నాగార్జునసాగర్, మహానాడు :  కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో డ్యాం మూడు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జుసాగర్ జలాశయానికి సోమవారం 1,32,760 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రాల ద్వారా 54,772 క్యూసెక్కులు, శ్రీశైలం డ్యాం మూడు క్రస్టుగేట్ల ద్వారా 76,056 క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయానికి వదులుతున్నారు. శ్రీశైలం నీటిమట్టం 879.00 అడుగులకు పెరిగింది. ఇది 184 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ నీటిమట్టం 512.00 అడుగులకు పెరిగింది. ఇది 136.1274 టీఎంసీలకు సమానంగా ఉంది.

కర్ణాటక కృష్ణా తీర ప్రాంతంలో భారీగా వర్షాలు పడటంతో, దిగువ కృష్ణా జలాశయాలైన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, రోజా, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులన్నీ గరిష్టస్థాయికి చేరువై నిండు కుండల్లా మారాయి. జూరాల, రోజా నుంచి శ్రీశైలం జలాశయానికి 4,52,583 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. సాగర్ జలాశయానికి మరో 12 గంటల్లో వరద నీరు భారీగా పెరిగే అవకాశం ఉంది.