ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు హామీ
నరసరావుపేట, మహానాడు: లింగంగుంట్ల అగ్రహారం రైతులు దశాబ్దాలుగా పడుతున్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తానని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు హామీ ఇచ్చారు.తనను కలిసిన రైతు సంఘం నాయకులకు భరోసా ఇచ్చారు. స్త్రీ ధనం, పసుపు కుంకుమ కింద వచ్చిన భూములు కూడా అవసరానికి పనికి రాకుండా పోయాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు అమ్ముకుందామన్నా, బ్యాంకుల్లో తాకట్టు పెదదామన్నా కుదరడం లేదన్నారు.
గతంలో ఎంపీ రాయపాటి సాంబశివరావు సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చినా నాడు ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాలేదని, ఇప్పుడు పరిష్కరించేందుకు సాయశక్తులా పని చేస్తానని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించే ప్రయత్నం చేస్తానని, ముఖ్యమంత్రి ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నియమితులైన వెంటనే సమస్యను పరిష్కరించేందుకు వెళ్లి కలుస్తానని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంగుల పెద్దిరెడ్డి, మిర్యాల ఏడుకొండలు, మహానంద రెడ్డి, ప్రభుదాస్, బాలమోహన్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, మిరియాల వెంకటసుబ్బమ్మ, గోవింద్, రైతులు పాల్గొన్నారు.