ఏపీలో మద్యంషాపులు బంద్‌.. ఎప్పుడంటే…

-కౌంటింగ్‌ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
-భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ వెల్లడి

అమరావతి: ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 3 సాయంత్రం నుంచి 5వ తేదీ ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు మూసివేయాలని నిర్ణయించింది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యగా మద్యం దుకాణాలు బంద్‌ చేయాలని డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా హోటళ్లు, లాడ్జిలలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లాల సిబ్బందిని ఆదేశించారు. సోషల్‌ మీడియాపై ఓ కన్నేసి ఉంచాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.