– అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
ఏలూరు, మహానాడు: సాహిత్యానికి భారతీయ సంస్కృతిలో సమున్నత స్థానం ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం ఏలూరు పట్టణంలోని రామకృష్ణాపురంలో సాహిత్య మండలి, కేవీఎస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సాహిత్య మండలి, పుల్లాభోట్ల శ్రీరామమూర్తి ప్రాంగణంలో అంబికా రామచంద్రరావు – అనసూయమ్మ సాహిత్య వేదికపై శరన్నవరాత్రుల సాహిత్య ఉత్సవం-కేవీ సత్యనారాయణ సాహిత్య పురస్కార సభ జరిగింది.
ముఖ్యఅతిథిగా మాజీ ఉప సభాపతి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేశారు. నాట్యాచార్య గండికోట రాజేష్ శిష్య బృందంచే స్వాగత నృత్యాంజలి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అష్టావధానంలో అవధానిగా విశాఖ నుంచి శతావధాని డాక్టర్ తాతా సందీప్ శర్మ, సంధాన కర్తగా రాజమహేంద్రవరం నుంచి పద్య కళాతపస్వి ఆచార్య డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి విచ్చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కేవీ సత్యనారాయణ సాహిత్య ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేసి అవధానులను, పృచ్ఛకులను ఘనంగా సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథి బుద్ధప్రసాద్‌ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.