అవయవ దానంతో మళ్లీ జీవించండి

– జాయింట్ కలెక్టర్, భార్గవ్ తేజ ఐఎఎస్

బ్రెయిన్ డెత్ తో మరణించిన వారి అవయవాలతో 9 మందికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించగలమని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ ఐఎఎస్ పేర్కొన్నారు. ఈనెల మూడో తేదీన మానవత ఆధ్వర్యంలో జాతీయ అవయవ దాన దినోత్సవ సభ గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో గల బాలాజీ కళ్యాణ మండపంలో జరిగింది.

ముఖ్య అతిథిగా విచ్చేసిన భార్గవ్ తేజ ప్రసంగిస్తూ ప్రస్తుత జన్మలోనే పుణ్యం సాధించాలంటే అవయవ దానానికి మించిన పుణ్య కార్యం మరొకటి లేదన్నారు. మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు అవయవదానానికి అడ్డంకిగా మారుతున్నాయన్నారు. వైద్య, వైజ్ఞానిక రంగాలలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు వలన అవయవాలను మరొకరికి సులువుగా మార్చడానికి వీలు కలుగుతుందన్నారు. గ్రీన్ కారిడార్ దీనికి మరింత తోడ్పడుతుందన్నారు.

జిల్లా అవయవ, శరీర దాతల సంఘం అధ్యక్షులు డాక్టర్ రమణ యశస్వి మాట్లాడుతూ కిడ్నీలు అవసరమైన వారు దేశవ్యాప్తంగా లక్షన్నరకు పైబడి ఉంటే దాతలు 1500 మందే లభిస్తున్నారన్నారు. అవయవ దానం చేసిన దాతలకు మరణానంతరం ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ ప్రదంగా అంత్యక్రియలు జరపాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అవయవ దానం పట్ల అవగాహన పెంచేందుకు ఈ అంశాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని కోరారు.

జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచంలో స్పెయిన్ దేశంలో ప్రతి 10 లక్షల మందికి 47 గురు అవయవ దాతలు ఉండగా మన దేశంలో కేవలం ఒక్కరు మాత్రమే ఉండటం బాధాకరమన్నారు. అవయవ దాతలు లేక సకాలంలో అవయవాలు దొరకక ప్రతి ఏటా భారతదేశంలో ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.

రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డా. భువనగిరి శ్రీకృష్ణవేణి ప్రసంగిస్తూ అవయవదానం పట్ల అవగాహన పెంచితే రోడ్డు ప్రమాదాల ద్వారా అకాల మరణం పొందుతున్న వారి అవయవాల ద్వారా అవసరమైన వారికి చిరకాల జీవితాన్ని అందించగలమన్నారు.

మానవత చైర్మన్ పావులూరి రమేష్ ప్రసంగిస్తూ మానవత ఇచ్చిన పిలుపును అందుకుని వందమంది శరీర, అవయవ దాతలుగా జీవన్ దాన్ లో నమోదు కావడం గర్వకారణం అన్నారు.

మానవత అవయవ దాన కమిటీ చైర్మన్ తూను గుంట్ల సుందర రామయ్య ప్రసంగిస్తూ మానవత లో నేడున్న 100 మంది అవయవ, శరీర దాతల సంఖ్యను వెయ్యి మందికి చేర్చడానికి కృషి చేస్తామన్నారు. శరీర, అవయవ దాతలకు జీవన్ దాన్ గుర్తింపు కార్డులను అందించి జ్ఞాపికలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మానవత ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి కె.సతీష్, కోశాధికారి టి.వి. సాయి రామ్, డైరెక్టర్స్ ఉప్పల సాంబశివరావు, బి.యన్. మిత్రా, ఎన్. సాంబశివరావు, బాలకృష్ణ చౌదరి, సి.హెచ్. శివాజీ, లక్ష్మి సామ్రాజ్యం తదితరులు ప్రసంగించారు.

ఇట్లు
పావులూరి రమేష్
మానవత చైర్మన్
9866012690