Mahanaadu-Logo-PNG-Large

బీసీలకు రిజర్వేషన్లు తేల్చాకే స్థానిక ఎన్నికలు

లేకుంటే మిలియన్‌ మార్చ్‌ తరహా ఉద్యమం
ముస్లింలకు ఓబీసీ కోటా రద్దు హర్షణీయం
బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్‌

హైదరాబాద్‌ :  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీ కమిషన్‌ ద్వారా కుల గణన చేసి 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని లేఖ విడుదల చేసిందని, మొదటి అసెంబ్లీ అయిపోయినా ఇంతవరకు అమలు చేయలేదని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్‌ మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు తేల్చ కుండా స్థానిక ఎన్నికల కు వెళ్లడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అమలు సాధనకు అవసరమైతే మిలియన్‌ మార్చ్‌ తరహాలో ఉద్యమిస్తామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే కాంగ్రెస్‌ నాయకులు ప్రజలకు వద్దకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు. ఏడాదికి బీసీ వెల్ఫేర్‌ కోసం 20 వేల కోట్లు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రతి నాయకుడి డీఎన్‌ఏలో బీసీ వ్యతిరేకతే ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం ఉపకులాలకు ఓబీసీ కోటా రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పునివ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆ తీర్పుని పాటించని మమతాబెనర్జీ సీఎం పదవి లో ఉండే అర్హత లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌ తర్వాత వెస్ట్‌ బెంగా ల్‌లో రాజకీయంగా భారీ మార్పులు జరగబోతున్నాయని, బీజేపీ మెజారిటీ సీట్లు గెలవబోతుందని తెలిపారు.