– ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోతు రాజు
విజయవాడ, మహానాడు: మానవాళికి ప్రాణవాయువునందిస్తున్న మొక్కలను ఇష్టపడటమే కాదు.. ప్రేమించాలని ఫారెస్ట్ రేంజర్ డి. పోతురాజు పిలుపునిచ్చారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ అసమతుల్యత, టెర్రరిజం ప్రపంచానికి పెనుముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చర్మ సంబంధిత క్యాన్సర్ల ముప్పు పొంచి ఉందని, మొక్కలను పెంచి ఆ ప్రమాదం నుంచి బయటపడాలని తెలిపారు. మానవాళి చెట్లను అమ్ముకొని కాకుండా నమ్ముకొని జీవించాలని హితవు పలికారు. చెట్టుని పెంచి పెద్ద చేస్తే ఓ ప్రార్థనా మందిరాన్ని నిర్మించిన దానితో సమానమని మహాత్ముని మాటలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. సమస్త జీవకోటి అస్తిత్వాన్ని కాపాడటానికి, మానవ మనుగడ కోసం, భవిష్య తరాల అవసరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలని పోతురాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోటికి పైగా మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్యను కొనియాడారు.
పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అని అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. గ్రంథాలయ ప్రాంగణంలో మొక్కలు నాటడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల అవసరార్థం పుస్తకాలను గ్రంథాలయానికి బహూకరించారు.
ఈ కార్యక్రమంలో గెజిటెడ్ లైబ్రేరియన్ వెంకటేశ్వర రావు, మానవత చైర్మన్ పావులూరి రమేష్, ప్రెసిడెంట్ కె.ఎస్.ఆర్, సెక్రెటరీ కె.సతీష్, కోశాధికారి టీవీ సాయిరాం, ఉప్పల సాంబశివరావు, బి.ఎన్ మిత్ర, ఎన్.సాంబశివరావు, వర్రె సుబ్రమణ్యం, సిహెచ్ శివాజీ, లక్ష్మీ సామ్రాజ్యం, టి. ఉమామహేశ్వరరావు, తిరుపతి రెడ్డి, కాంచన, శ్రీనివాస రెడ్డి, బాలకృష్ణ, సుధాకర్, అనంతరామయ్య, సాయి కిరణ్, కె. నీలి, టి. ధనుంజయ రెడ్డి, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.