• ఇప్పటికే ఇద్దరు ఆర్డీఓలు,సీనియర్ అసిస్టెంట్ సస్పెన్సన్
• త్వరలో రాజముద్ర,క్యుఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ
• భూములు భూములు అన్యాక్రాంతం కాకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చే ఆలోచన
• ఉమ్మడి చిత్తూరు,నెల్లూరు,ఒంగోలు జిల్లాల్లో రెవెన్యూ ఉన్నతాధికారుల పర్యటనలు
• జగన్ బొమ్మ ఉన్నసర్వే రాళ్ళకు 650 కోట్లు,పాస్ పుస్తకాలకు 13 కోట్లు వృధా చేశారు
• 7వేల గ్రామాల్లో జరిగిన భూముల రీసర్వేను గ్రామ సభల ద్వారా పున:పరిశీలన చేస్తాం
• సీఎం ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖలో ప్రక్షాళనకు త్వరలో శ్రీకారం
– రాష్ట్ర రెవెన్యూ,రిజిస్ట్రేషన్లు,స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు,దస్త్రాల దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని రాష్ట్ర రెవన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించి మదనపల్లి సంఘటనలో బాధ్యులపై చర్యలు,అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు,రెవెన్యూ శాఖలో ప్రక్షాళన ఆవశ్యకత,అసైండ్ భూములు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారని చెప్పారు.
అనంతరం సచివాలయం నాల్గవ భవనంలో మంత్రి సత్యప్రసాద్ మీడియా సమావేశంలో ఆవివరాలను వెల్లడించారు.మదనపల్లి సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాను మూడు రోజుల పాటు అక్కడే ఉంచి పూర్తి స్థాయి విచారణ చేయించగా ఆయన విచారణ నివేదికను సోమవారం ప్రభుత్వానికి సమర్పించారని చెప్పారు.ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే గత ఆర్డీఓ సహా ప్రస్తుత ఆర్డీఓను,ఒక సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు.
ఈ సంఘటన విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్ల జరిగింది కాదని కుట్రపూర్వకంగానే జరిగిందని ఇప్పటి వరకూ జరిగిన విచారణను బట్టి తెలుస్తోందని,ఇంకా పూర్తి విచారణ జరుగుతోందని దీనితో సంబంధం ఉన్న ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ పునరుద్ఘా టించారు.
జిల్లాల్లో రెవెన్యూ శాఖ అధికారుల పర్యటనలు..
మదనపల్లెలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల బాధితులు భారీగా వందల సంఖ్యలో తరలి వచ్చి ఫిర్యాదులు ఇచ్చారని అదే విధంగా వైసిపి నేతలు,రాష్ట్ర వ్యాప్తంగా భూఅక్రమాలకు పాల్పడ్డారని వాటన్నిటిపైనా విచారణ జరిపిస్తామని చెప్పారు.ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు,విశాఖ,నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ భూదందాలు జరిగాయని, వ్యవస్థల మీద నమ్మకం కలగాలి అంటే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారని అన్నారు.
ముందుగా నాలుగు ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, సిసిఎల్ఏ జి.జయలక్ష్మితో పాటు ఇతర అధికారులు పర్యటిస్తారని ఆతదుపరి మిగతా జిల్లాల్లోను పర్యటించి భూఅక్రమాలకు సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు.అదే విధంగా గత ప్రభుత్వం ప్రవేట్ వ్యక్తులకు దోచిపెట్టిన భూములను అవసరాలకు వాడకుండా దుర్వినియోగం చేస్తే ఆయా కేటాయింపులు రద్దు చేసే అంశంపై కూడా సియం సమీక్షించినట్టు తెలిపారు.
మదనపల్లి లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వర్యుల సమీక్షలో స్పష్టం చేశారని ఆదిశగా త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్య ప్రసాద్ పేర్కొన్నారు.ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల్లో సుమారు 80 శాతం భూ సంబంధిత వివాదాలే ఉంటున్నాయని కావున రెవెన్యూ కార్యాలయాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు.
నేరాలు జరగ కుండా చూడడంతో పాటు నేరాలు చేసిన వారిని సకాలంలో శిక్షించడం కూడా ముఖ్యమని అందుకే ల్యాండ్ గ్రాబింగ్ నియంత్రణకు గుజరాత్ తరహా చట్టాన్ని అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు.
త్వరలో రాజముద్ర,క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు..
త్వరలో రాజముద్ర,క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందించడం జరుగుతుందని రెవెన్యూ మంత్రి సత్య ప్రసాద్ వెల్లడించారు.ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆపొలం వివరాలతో పాటు ఆపొలానికి దారి చూపే విధానం తెస్తామని చెప్పారు.గత సియం జగన్ పొటోతో పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు 13కోట్ల రూ.లు ఖర్చు చేశారని ఆనిధులతో రెవెన్యూ శాఖలో అనేక మార్పులు,సంస్కరణలు తేవచ్చని అన్నారు.
అసైండ్ భూముల అక్రమాలపై సమగ్ర లెక్కలు..
గత ప్రభుత్వంలో చుక్కల భూముల విషయంలో అనేక అక్రమాలు జరిగాయని ఒక మెమో ద్వారా అధికారాలు మార్చి అక్రమాలకు ఊతమిచ్చారని,సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై కూడా సియం సమీక్షించినట్టు మంత్రి సత్య ప్రసాద్ మీడియాకు వివరించారు.ఆన్లైన్ విధానంతో అనేక అక్రమాలు చేశారని,22ఎలో పెట్టడం తొలగించడం,సులభంగా సర్వే నంబర్లను మార్చడంతో లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
అంతేగాక తహసిల్దార్ కార్యాలయంల్లో పాస్ వర్డ్ ను ఎవరికి పడితే వారికి ఇవ్వడంతో వ్యవస్థలు విధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు.అసైండ్ భుములు సామాన్యుల నుండి రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్ళాయని ఈవిషయంలో చాలా అక్రమాలు జరిగాయని, కొత్త చట్టం మూలంగా పేదలకు మంచి జరగకపోగా రాజకీయనేతలు లబ్ది పొందారని తెలిపారు. ఎస్సీల చేతుల నుండి భూములు ఎక్కడికి వెళ్ళాయని దానిపై పూర్తి నివేదకలు సిద్ధం చేయాలని,22ఎలో ఎన్ని పెట్టారు.ఎన్ని తీసేశారు ఎన్ని చోట్ల అటువంటి లావాదేవీలు జరిగాయనే దానిపై సమగ్ర లెక్కలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి సత్య ప్రసాద్ చెప్పారు.
అంతేగాక పేదల ఇళ్ళ స్థలాల విషయంలో ఆభూమి లావాదేవీలు ఎప్పుడు జరిగాయి, ప్రభుత్వం కొనడానికి ముందు ఆభూమి ఎవరి దగ్గర ఉంది తర్వాత ఎవరు కొన్నారు,అక్కడ అసలు ఆభూమి ధర ఎంత ఉంది,ప్రభుత్వానికి ఎంతకు అమ్మారు అనే వివరాలు పూర్తిగా సేకరించాలని సియం ఆదేశించినట్టు రెవెన్యూ మంత్రి చెప్పారు.
ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, విశాఖ,నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ భూ దందాలు జరిగాయని , వ్యవస్థల మీద నమ్మకం కలగాలి అంటే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సియం స్పష్టం చేశారని అన్నారు.అదే విధంగా గత ప్రభుత్వం ప్రవేట్ వ్యక్తులకు దోచిపెట్టిన భూములను అవసరాలకు వాడకుండా దుర్వినియోగం చేస్తే ఆయా కేటాయింపులు రద్దు చేసే అంశంపై కూడా సియం సమీక్షించినట్టు తెలిపారు.
రీసర్వే తప్పులు సరి చేసేందుకు గ్రామ సభలు..
గత ప్రభుత్వ హయాంలో 7 వేల గ్రామాల్లో భూముల రీసర్వే చేశారని అవి వాస్తవంగా జరిగాయా లేదా అనే దానిపై గ్రామ సభలు ద్వారా పున:సమీక్ష చేయడం జరుగుతుందని రెవెన్యూ మంత్రి సత్య ప్రసాద్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో రీసర్వే పేరుతో జగన్ బొమ్మతో కూడిన 77 లక్షల సర్వే రాళ్ళను పాతారని అందుకు 650 కోట్ల రూ.ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రస్తుతం ఆరాళ్ళను తొలగించాలన్నా 15 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అన్నారు. ఆరాళ్ళను అదనపు భారం పడకుండా ఏం చేయాలి ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచన చేయాలని సియం ఆదేశించినట్టు తెలిపారు.
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మాట్లాడుతూ మదనపల్లి సంఘటన షార్టు సర్క్యూట్ వల్ల జగిగింది కాదని నూరు శాతం కుట్రపూరితంగానే జరిగిందని తాను విశ్వసిస్తున్నట్టు స్పష్టం చేశారు.ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
కొంతమంది తహసిల్దార్ల ఫొర్జరీ సంతకాలతో కూడిన ధస్త్రాలను ఆఫైళ్ళ్లలో పెట్టారని చెప్పారు.ఈ ఘటనలో సుమారు 2వేల 445 దస్త్రాలు కాలిపోయాయని,సబ్ కలక్టర్ కార్యాలయంలో సిసి కెమెరాలు కూడా పనిచేయడం లేదని కావున కుట్రపూరితంగానే సంఘటన జరిగిందని సిసోడియా పునరుద్ఘాటించారు.