– తెలుగు పద్యానికి కీర్తిపతాకం నాగఫణిశర్మ
– ఘనంగా ప్రారంభమైన మహా శతావధానం
విజయవాడ, ఫిబ్రవరి 26: తెలుగు భాషలోని సౌందర్యాన్ని పూర్తిగా తన పద్యాల్లో నింపి ప్రపంచమంతా తెలుగు పద్యవైభవాన్ని చాటిన ఏకైక అవధాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ అని పలువురు వక్తలు కొనియాడారు. రాష్ట్ర దేవదాయ, ధర్మవాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నిర్వహిస్తున్న ‘శ్రీ దుర్గా సౌందర్య లహరీ మహాశతావధానం’ సోమవారం స్థానిక తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమైంది.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్ మాట్లాడుతూ తెలుగు వారికి మాత్రమే సొంతమైన ప్రక్రియ అవధానం అని, అటువంటి అవధాన విద్యకు నాగఫణిశర్మ కీర్తిపతాకంగా నిలుస్తున్నారని కొనియాడారు. తెలుగు పద్యాన్ని, కవిత్వాన్ని రంగరిస్తూ నాగఫణిశర్మ చేసే అవధానం తెలుగు పద్యాన్ని అమృతమయం చేస్తుందన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు మాట్లాడుతూ నాగఫణిశర్మ పద్యాలు తేనెల వాన కురిపిస్తాయన్నారు. కేవలం సాహితీ విన్యాసంగా కాకుండా యువతరానికి వ్యక్తిత్వవికాస సాధనంగా అవధానం ఉపయోగిస్తుందన్నారు. ప్రత్యేకించి యువతరం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని స్ఫూర్తి పొందాలని సూచించారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నాగఫణిశర్మ మహాశతావధానం ద్వారా విజయవాడ సాంస్కృతిక రాజధాని అనే పేరు శాశ్వతం అవుతుందన్నారు. దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ నిత్యం ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి చేస్తున్న పూజల తీరులో ఐదురోజుల పాటు సాహిత్య నివేదన చేస్తున్నట్లుగా అవధానం సాగుతుందన్నారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు మాట్లాడుతూ అవధాన వాగ్గేయకారుడిగా నాగఫణిశర్మను వర్ణించారు. శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ప్రముఖ జర్నలిస్ట్ మా శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రారంభమైన అవధానంలో 30 మంది పృచ్ఛకులు అడిగిన దత్తపదులు, 15 మంది అడిగిన సమస్యలకు అవధాని అద్భుతమైన పూరణలు చేసారు