ఇక బందరుకు మహర్దశ

అమృత్ పథకం అమలు చేస్తాం
ఆయిల్ రిఫైనరీ తో ఉపాధి అవకాశాలు
డ్రైనేజీ సమస్యపై దృష్టి పెట్టాం
ఆసుపత్రిలో నిర్వాహం పై విచారణ జరుపుతాం
గత పాలకుల నిర్లక్ష్యంతోనే తాగునీటి సమస్య
బందరులో మంత్రి కొల్లు రవీంద్ర

బందరు: మచిలీపట్నానికి మహర్దశ రాబోతుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం నగరంలోని జవ్వారిపేటలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఒకవైపున జోరుగా వర్షం కురుస్తున్న మరోవైపు అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అద్భుతంగా ముందుకు సాగుతోందన్నారు.

మచిలీపట్నానికి మహర్దశ రాబోతుందని ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ. 58 కోట్లతో అమృత్ పథకాన్ని అమలు చేయనున్నామన్నారు. బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ రూ. 60 వేల కోట్ల నుంచి రూ. 70 వేల కోట్లతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీని నెలకొల్పుతామన్నారు.

మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి కేంద్రం నుండి పథకాలు, నిధులు తీసుకురావడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాబోయే 2, 3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పనకు, పరిశ్రమలు నెలకొల్పుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

గత పాలకుల నిర్లక్ష్య ఫలితం ఇది

ప్రభుత్వం సరిగా నీటి యాజమాన్యం చేయక పులిచింతలలో నీరు లేక కృష్ణ డెల్టాను ఎడారి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పులిచింతల ప్రాజెక్ట్లో 30 నుంచి 40 టీఎంసీల నీరు నిలువ చేసుకోకుండా వచ్చిన వర్షపు నీటిని సముద్రంలోకి వదిలేసారని, ప్రస్తుతం అర టీఎంసీ కూడా నీరు లేదని దీంతో సాగునీటికీ, తాగునీటికి ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఆనాడు తాము నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా నీటిని వదలాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా ఆయన అందుకు అంగీకరించి పట్టిసీమ నుండి ప్రకాశం బ్యారేజ్ కి నీళ్లు వదిలామన్నారు. అక్కడి నుంచి ఆదివారం తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీళ్లు నింపుతున్నట్టు వివరించారు.

డ్రైనేజీ సమస్య అధిగమిస్తాం

మచిలీపట్నంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్యను అధిగమించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మురుగు కాలువలలో పూడికలను తొలగించాలని జిల్లా కలెక్టర్ కు, మున్సిపల్ అధికారులకు ఇప్పటికే సూచించామని ఆ పనులు జరుగుతున్నాయన్నారు.ప్రజల సమస్యల పట్ల తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకొంటామన్నారు.

ప్రజా దర్బారు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్నామన్నారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి అర్జీలు వస్తున్నాయని, ఈ విషయమే రాష్ట్రస్థాయిలో త్వరలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం తన శాఖకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పనులు చూస్తున్నామని, త్వరలో ప్రజల దగ్గరకు నేరుగా వెళ్తామన్నారు.

బందరు ఆసుప్రతిపై ప్రత్యేక దృష్టి

విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల కిందట ఘంటసాల మండలం శ్రీకాకుళంకు చెందిన స్వరూప రాణి ప్రసవించిన బాలుడు అదృశ్యం కావడంపై పోలీసులు విచారణ జరిపారని, సీసీ ఫుటేజ్ ద్వారా ఇంగ్లీష్ పాలెం చెందిన ఒక మహిళ వద్ద ఉన్నట్లు గుర్తించి బాలుడిని ఆ తల్లి దగ్గరకు చేర్చారని, ఆస్పత్రిలో ఎవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ ఇంకా జరుగుతుందని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

భద్రతా వైఫల్యం వలనే ఇది జరిగిందని, ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో ఎమ్మారై స్కానింగ్ చేయుటకు ఫిల్ములు లేవని చెబుతున్నారని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి వెంటనే స్పందిస్తూ ఈ విషయమై తగిన చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ పాల్గొన్నారు