మచిలీపట్నానికి మహర్ధశ!

మురుగు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు
అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణానికి కేంద్రం బృందం అధ్యయనం
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవతో కేంద్ర బృందం పరిశీలన

మచిలీపట్నం, మహానాడు : మచిలీపట్నాన్ని ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మురుగు సమస్యను పరిష్కరించే విధంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లాకు కేంద్ర బిందువు అయిన బందరులో డ్రెయినేజీ సమస్య కారణంగా అనేక సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే… స్థానిక ప్రజలతోపాటు, వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. అనేక రోడ్లు జలమయం కావడం, ఇళ్ల మధ్యన మోకాలి లోతు నీరు నిలిచిపోయి ప్రజలు అల్లాడిపోయేవారు.

ఈ సమస్యను గత ప్రభుత్వ హయాంలోనే గుర్తించిన ఎంపీ బాలశౌరి కేంద్ర ప్రభుత్వ నిధులతో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి బందరు ప్రజల అవస్థలను వివరించి సుమారు 350 కోట్లు వ్యయంతో డ్రెయిన్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలని భావించారు. కానీ, అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఈ పనులు ముందుకు సాగకుండా అడ్డుకున్నారు.  అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఎంపీ బాలశౌరి మరోసారి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపట్టారు.

కేంద్ర బృందం రావడానికి కారణం ఇదే..

మచిలీపట్నం నగరం, సముద్రతీరానికి మధ్య భౌగోళికంగా వ్యత్యాసం ఉండటం వల్ల అన్ని నగరాల్లో నిర్మించినట్లు ఇక్కడ డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. దీంతో కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని ఎంపీ బాలశౌరి రప్పించారు. నేటి నుంచి రెండు మూడు రోజులు బందరు పట్టణంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించి అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై క్షుణ్నంగా అధికారులు పరిశీలన చేయనున్నారు. దీనిలో భాగంగా ఎంపీ బాలశౌరి అభ్యర్ధన మేరకు  ఢిల్లీ నుంచి  CEEPHO నుంచి డాక్టర్ రమాకాంత్ , మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ నుంచి ఆరిత్ర దాసు, చీఫ్ ఇంజినీర్ ఆంజనేయులు, ఇతర సాంకేతిక సిబ్బంది మచిలీపట్నానికి మంగళవారం వచ్చారు. కేంద్ర బృందానికి మచిలీపట్టణం మున్సిపల్ సిబ్బంది కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇటు మున్సిపల్‌ అధికారులు, అటు మున్సిపల్‌ అధికారులు కలిసి ఈ డ్రైనేజీ ఏర్పాటు అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ పనులు వేగవంతంగా జరుగుతుండటంతో ప్రజలు సైతం త్వరలో మురుగు సమస్యకు పరిష్కారం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ప్రతి పనినీ అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే..

మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి 2019లో గెలుపొందారు. అప్పట్లోనే బందరు డ్రైనేజీ సమస్యలు స్థానిక ప్రజలు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఆ వెంటనే ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రితో పలుమార్లు భేటీ అయ్యారు. సుమారు రూ.350 కోట్ల వరకు నిధులు ఇచ్చేలా ఒప్పించారు. ఈ నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంపై కేంద్ర బృందం అధ్యయనం చేసేందుకు బందరు వచ్చేందుకు కూడా సిద్ధమైంది. ఇదే అంశంపై కేంద్ర బృందం పలుమార్లు మచిలీపట్నం మున్సిపల్‌ అధికారులకు లేఖలు కూడా రాశారు. అయితే మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని అధికారులను బెదిరించి, స్థానిక అధికారులు కేంద్ర బృందం వచ్చేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో మురుగు సమస్య కొనసాగుతూ వచ్చింది. అభివృద్దిని అడ్డుకున్న నాయకుడిని ప్రజలు ఓడించిన ఇంటికి పంపడంతో నేడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడితే మచిలీపట్నానికి మహర్ధశ వచ్చినట్లే అని ప్రజలు భావిస్తున్నారు.

ఎంపీ గారి కార్యాలయం, 
మచిలీపట్నం.