– భర్త వసీం అక్రమ్, కుటుంబ సభ్యులే నిందితులని బాధితుల ఫిర్యాదు
అన్నమయ్య జిల్లా, మహానాడు: ఫేస్బుక్ పరిచయం.. పెళ్లిదాకా తీసుకెళ్ళింది.. కానీ.. భర్త, అతని కుటుంబసభ్యుల తీరుతో ఓ మహిళ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా పీలేరులో చోటుచేసుకుంది. బాధితురాలు అర్షియ అత్తారింట్లో జరుగుతున్న గొడవలు, వేధింపుల విషయంపై మాట్లాడేందుకు రెండ్రోజుల క్రితం పీలేరులోనీ పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత తిరిగి సాయంత్రమే వాల్మీకిపురంలోని అత్తవారింటికి చేరుకుంది.
ఇంటికి వచ్చిన గంటలోపే ఆర్షియ సెల్ఫోన్ ఆఫ్ అయింది. ఈలోపే అర్షియ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం పీలేరులో ఉన్న తల్లిదండ్రులకు అందింది. ఉరి వేసుకుని మృతి చెందిందని.. వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రిలో డెడ్ బాడీ ఉందని చెప్పడంతో అర్షియ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఉదయం ఇంటికి వచ్చి కష్టాలు, బాధలు చెప్పుకున్న కూతురు సాయంత్రానికి శవంగా మారడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అర్షియను అత్తారింటి వారే హతమార్చారని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్షియ తల్లిదండ్రులు. భర్త వసీం, అత్తామామలే అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
అర్షియ మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. అర్షియా అత్తామామలను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఫేస్బుక్ పరిచయం పెళ్లి వరకు వెళ్లినా.. వసీం అక్రమ్.. అతని కుటుంబ సభ్యుల తీరుతో అర్షియా జీవితం ఇలా ఏడాదిన్నరలోపే అర్ధాంతరంగా ముగిసి పోయిందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.