ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ దోపిడీ

భాస్కర్‌రెడ్డి, ద్వారంపూడిలతో తతంగం నడిపిన జగన్‌
మిల్లర్లతో కుమ్మక్కు…కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్‌ బియ్యం
దోపిడీ విలువ రూ.50 వేల కోట్లు..అనధికారికంగా లక్ష కోట్లు
కేంద్ర నిధులు, టీడీపీ పాలనలో ఇచ్చిన సరుకులకు కుచ్చుటోపి
18 రకాల నిత్యావసరాలు హాంఫట్‌
పండుగలకు కూడా పేదలపై పక్షపాతం
కూటమి నేతలు మర్రెడ్డి, లంకా దినకర్‌, శివశంకర్‌

మంగళగిరి, మహానాడు : ప్రజా పంపిణీ వ్యవస్థలో జగన్‌ భారీ దోపిడీకి పాల్పడ్డారని కూటమి నేతలు ఆరోపించారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం బియ్యం మాఫియాపై ఎన్డీఏ నేతలు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, లంకా దినకర్‌, శివశంకర్‌లు మీడియా సమావేశం నిర్వహించారు. పేదలకు ఇవ్వాల్సిన సరుకులకు జగన్‌ కుచ్చుటోపి పెట్టి భారీ దోపిడీకి పాల్పడి వారి పొట్ట కొట్టాడని మండిపడ్డారు. జగన్‌రెడ్డి తొత్తులతో ప్లాన్‌ చేసి మిల్లర్లతో కుమ్మక్కై రేషన్‌ సరుకుల పంపిణీ కోసం కొనుగోలు చేసిన వాహనాల్లోనే అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తూ కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేషన్‌ వాహనాల్లోనే తరలింపు

తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలో 50 శాతం సబ్సిడీతో రేషన్‌ దుకాణాల్లో సరుకులు అందిస్తే.. అధికారంలో వచ్చిన వెంటనే రేషన్‌ సరుకు ల్లో కోత పెట్టిన ఘనుడు జగన్‌ రెడ్డి అని మండిపడ్డారు. కందిపప్పు, పంచదార ధరలు పెంచి దోచుకున్నాడని ఆరోపించారు. ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌ మాదిరిగానే రేషన్‌ సరుకుల్లో దోపిడీకి తెరలేపారని ధ్వజమెత్తారు. ద్వారంపూడి, భాస్కర్‌లు మిల్లర్లతో కుమ్మక్కై కాకినాడ కేంద్రంగా ఆదానీకి అప్పగించిన పోర్టు ద్వారా రేషన్‌ బియ్యాన్ని విదేశాలకు తరలిస్తూ వేల కోట్లు దోచుకున్నారని తెలిపారు. సంచుల పేరుతో అనుంగ కంపెనీకి 750 కోట్లు దోచి పెట్టా రన్నారు. రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో రేషన్‌ వాహనాల పాత్ర కీలకంగా ఉందన్నారు.

పేదలకు పండుగలను దూరం చేసిన దుర్మార్గుడు జగన్‌ రెడ్డి అన్నారు. పండుగ రోజు కడుపు నిండా తినేందుకు 18 రకాలు సరుకులను ఉచితంగా ఆనాడు చంద్రబాబు అందిస్తే వాటిని మాయం చేసి దోచుకున్నారన్నారు. నాడు సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ అప్పు 10 వేల కోట్లు ఉంటే నేడు దాన్ని 30 వేల కోట్లకు పెంచారు. వేల కోట్లు అప్పులు చేసినా, కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు వచ్చినా పేదలకు ఇచ్చిన సరుకులు ఏమీ లేవని, దీనిని బట్టి ఎంత దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. అప్పులు పెంచుకుని దోపిడీకి తెరలేపారని వివరించారు.
దాదాపుగా 50 వేల కోట్లను ద్వారంపూడితో కలిసి జగన్‌ దోచుకున్నాడన్నాడని ఆరోపించారు. అనధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు దోచుకున్న సొమ్ము లక్ష కోట్ల వరకు ఉంటుం దని తెలిపారు. దీనిని ప్రజలు గమనించాలని కోరారు.

18 లక్షల టన్నుల నుంచి…31 లక్షల టన్నులకు…

జనసేన ప్రనధాన కార్యదర్శి శివశంకర్‌ మాట్లాడుతూ కేంద్రం సహాయంతో అందుతున్న సబ్సిడీ సరుకులను దోచుకుని ప్రజా పంపిణీ వ్యవస్థను వైసీపీ నాశనం చేసింది. రాష్ట్రానికి 39 వేల కోట్లు కేంద్రం అందించింది. ఒక కిలో బియ్యానికి రాష్ట్రం ఇచ్చేది కేవలం ఒక్క రూపాయి మాత్రమే… కేంద్రం ఇచ్చేది రూ.37 రూపాయలు. లబ్ధిదారులకు ఇస్తున్నామని చెప్పి మిల్లర్లతో కుమ్మక్కై ప్రభుత్వంలో ఉన్న అధికారులతో కలిసి పెద్ద స్కామ్‌కు జగన్‌రెడ్డి తెరలేపారు. 2018-19లో కాకినాడ పోర్టు నుంచి 18 లక్షల మెట్రిక్‌ టన్నులు ఎగుమతి అయితే 2020-21లో 31 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగిపోవటం చూస్తే దోపిడీ ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజా వ్యవస్థను మెరుగు పరిచేందుకు రేషన్‌ వాహనాలు కొంటే గత ప్రభుత్వం కంటే రేషన్‌ తీసుకునే లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సి పోయి తగ్గిపోయిందన్నారు. భాస్కర్‌రెడ్డి రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ గా.. దొంగ చేతికి తాళం ఇచ్చి దోచుకున్నారు. సాక్షాత్తు పార్లమెంట్‌లో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ రూ.2 వేల కోట్లు ఏపీలో పక్కదారి పట్టిందని చెప్పారు. అయినా సిగ్గు లేకుండా వేసీపీ నేతల దోపిడీ మాత్రం ఆగలేదు. మిల్లర్లు ఫేక్‌ బ్యాంక్‌ గ్యారంటీ చలానా స్కామ్‌ బయట పడిరది. మిల్లింగ్‌ చార్జీలు ఇస్తూ మిగిలిన వాటిని ఎగ్గొట్టిన వైనం బయటపడిరది. నెల్లూరు జిల్లాలో ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ సంద్యపూడి శివకుమార్‌ అనే వ్యక్తి రూ.29 కోట్లు మళ్లించి న వైనం చూస్తేనే దోపిడీ ఏ మాత్రం జరిగిందో అర్థం అవుతుంది. దాంట్లో శివకుమార్‌ ఖాతాకే 10 కోట్లు వెళ్లింది. దీనిపై కేంద్రం పూర్తి విచారణ చేపట్టాలని కోరారు.

జగన్‌ సూత్రధారి…ద్వారంపూడి పాత్రధారి

బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌ మాట్లాడుతూ..బియ్యం మాటున రాబంధుల్లాగా వైసీపీ నేతలు దోచుకుంటున్నారు. జగన్‌ కనుసన్నలో జరిగిన అవినీతి అక్షరాలు రూ.50 వేల కోట్లకు పైమాటే. సివిల్‌ సప్లయీస్‌ ద్వారా చేసిన అప్పుల్లో అధిక భాగం అవినీతిమయం. గత ఎన్నిక ల్లో సన్న బియ్యం ఇస్తానన్న జగన్‌రెడ్డి ఉన్న బియ్యాన్ని దోచుకుని దండుకుంటున్నాడు. రాష్ట్రంలో బియ్యం మాఫియా సూత్రధారి జగన్‌ అయితే… పాత్రదారి ద్వారంపూడి చంద్రశేఖ ర్‌రెడ్డి. బంధువులతో ద్వారంపూడి సులువుగా బియ్యం మాఫియాకు తెరతీశారు. కేంద్రం ఉచి తంగా ఇస్తున్న బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేస్తూ ద్వారంపూడి కింగ్‌ పిన్‌గా విదేశాలకు తరలిస్తున్నా రు. ఒక్క గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన కింద గత ఐదేళ్లలో రూ.22 వేల కోట్ల విలువైన బియ్యాన్ని కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది. నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కింద గడిచి ఐదేళ్లలో రూ.46 వేల కోట్లు కేంద్రం ఏపీకి ఇచ్చింది. కేంద్ర ఇస్తున్న సబ్సిడీ చాలడం లేదని సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ ద్వారా ఏపీ అప్పులు చేసింది. ఆ అప్పులతో వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారని వివరించారు. మొత్తంగా ఐదేళ్లలో ప్రజా పంపిణీ వ్యవస్థకు లక్ష కోట్లు వచ్చాయి. దాంట్లో 50 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన రూ.50 కోట్లు ఏ పంది కొక్కులు మెక్కాయి? కేంద్రం ఏపీలో 89 లక్షల కుటుంబాలకు సహాయం చేస్తుంది. జగన్‌ మాత్రం రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బీపీఎల్‌ ఫ్యామిలీలో చూపిస్తున్నారు. జగన్‌ రెడ్డి కూడా బీపీఎల్‌ ఫ్యామిలీలో భాగమేనా? అని ప్రశ్నించారు. పేదల కడుపు కొడుతున్న జగన్‌ రెడ్డిని ఇంటికి పంపడానికి మరో 25 రోజులే ఉందని కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.