రుణాలు ఇప్పిస్తానంటూ మాయమాటలతో మోసం
పోలీసుస్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు
గుడివాడ, మహానాడు : కృష్ణా జిల్లా గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పి కోటిన్నర కాజేసిన మాయలేడి పరారైన ఘటన వెలుగుచూసింది. మాయ లేడి లీలావతిపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలంటూ బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు ఇప్పి స్తానంటూ లీలావతి అనేక మందిని నమ్మించింది. లక్ష్మీ నగర్ కాలనీ, బాపూజీ నగర్, చౌదరిపేట, ఆర్టీసీ కాలనీ, టీడ్కో కాలనీ, జగనన్న కాలనీల్లోని మహిళల తో 60 గ్రూపులు ఏర్పాటు చేసింది. గ్రూపుల్లోని సభ్యులకు మంజూరైన రుణాల్లో మాయమాటలు చెప్పి కోటిన్నర తీసుకుంది. అంతేకాకుండా పలువురి దగ్గర బంగారు ఆభరణాలు తీసుకుని తాకట్టు పెట్టింది. రుణాలు చెల్లించకపోవడం తో బ్యాంకుల ప్రతినిధులు తమ ఇళ్లకు వచ్చి గొడవ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీలావతి హైదరాబాదులోని మియాపూర్‌లో ఉందని తెలుసు కుని అక్కడికి వెళ్లి ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయిందని వెల్లడిరచారు.