– గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణపై ప్రతిపాదనలు సిద్ధం చేయండి
– భూసేకరణపై రైతుల అభిప్రాయాలు తీసుకోండి
– ఇరిగేషన్ అధికారుల సమీక్షలో పెమ్మసాని
గుంటూరు, మహానాడు: డ్రెయిన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో వరదలు ముంచెత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనికి గత ఐదేళ్లలో నల్లమడ వాగు, గుంటూరు నల్లా, గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణ చేపట్టకపోవడమే కారణం. ఈ మూడు డ్రెయిన్ల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాం. ఈ విస్తరణ, ఆధునికీకరణ ద్వారా ఐదు నియోజకవర్గాల్లో 77 గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. దీనిపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయండి అని రూరల్ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్స్ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్థానిక ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, గళ్లా మాధవితో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్షను శనివారం నిర్వహించారు. గత సమావేశంలో గుంటూరు ఛానల్, గుంటూరు నల్లా, నల్లమడ వాగుల అభివృద్ధి, విస్తరణ, ఆధునికీకరణపై చర్చించారు. ఛానల్ విస్తరణ కోసం అవసరమైన భూసేకరణపై గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని పెమ్మసాని అధికారులకు సూచించారు. భూమి ధరలు పెరిగాయని, దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు నల్లా ఆధునికీకరణ విస్తరణకు రూ.85 కోట్లు అవసరమని గుర్తించినట్టు చెప్పారు. కెనాల్ మురుగును నియంత్రిస్తే కాలుష్యాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. మంగళగిరిలో ఎస్టీపీ నిర్మాణాలకు స్థలం లేని క్రమంలో ప్రత్యామ్మాయ మార్గాల ద్వారా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇదే విధంగా నల్లమడ వాగు ఆధునికీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వివరించారు.
స్కిల్ కమ్యూనికేషన్స్ అధికారులతో సమీక్షలో భాగంగా పెమ్మసాని మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచి, ఉద్యోగాలు, ఉపాధిపై అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. గుంటూరులో వివిధ కంపెనీలతో చర్చించి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. దీనిపై రెండు నెలల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.