23న అన్ని గ్రామ పంచాయతీల్లో సభలు

• 2 రోజులు ముందుగానే దండోరా వేసి ప్రజలకు చెప్పాలి
• ఉపాధిహామీ కింద ఏడాదిలో 100 రోజులు పని దినాల కల్పనపై అవగాహన తేవాలి
• 2024-25 సం.రం లో చేపట్టే పనులపై సభ ఆమోదం తీసుకోవాలి
• సభలు అర్దవంతంగా జరగాలంటే ప్రజలు, అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొవాలి
• సచివాలయ ఉద్యోగులు భాగస్వాములు కావాలి
• పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దు
– ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కల్యాణ్‌

అమరావతి, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 23వ తేదీన 13వేల 326 గ్రామ పంచాయతీల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒకేరోజు గ్రామ సభలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి కె.వపన్ కల్యాణ్‌ వెల్లడించారు. గ్రామ సభలపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా పరిషత్ సిఇఓలు, డిపిఓలు, డ్వామా పిడిలు, ఎంపిడిఓలు తదితర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి గ్రామ సభలు విజయవంతానికి తీసుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ పంచాయితీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖల్లో పనిచేయడమంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, నిరుపేద కూలీలకు సేవ చేయడమేనని తాను నమ్ముతున్నాని అన్నారు.

పంచాయితీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీ నుండి జిల్లా పరిషత్ వరకూ పటిష్ఠంగా ఉన్నప్పుడే అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతామని, తద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించగలుగుతామని పేర్కొన్నారు. దానిలో భాగంగానే ఈనెల 23వ తేదీన సభలు నిర్వహించి, ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ఉపాధిహామీ పథకంలో ప్రతి కుటుంబానికి సం.రం.లో 100 రోజుల పని దినాలను కల్పిస్తున్న అంశంపై అవగాహన కల్పించడంతో పాటు కూలీలకు గల హక్కుల గురించి వివరించాల్సివుందన్నారు. అంతేగాక ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకోడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభలో ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే రీతిలో వివరించాలని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

సభ సమాచారాన్ని కనీసం రెండు రోజులు ముందుగానే ఆయా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలందరికీ తెలియజేయడం ద్వారా ప్రజలందరూ అధిక సంఖ్యలో సభలో పాల్గొనేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. అదే విధంగా జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బందికి గ్రామ సభ నిర్వహణపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. సభలు అర్ధవంతంగా జరగాలంటే గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామ సభల్లో మనస్ఫూర్తిగా పాల్గొనాలని ఆయన సూచించారు. గ్రామ సచివాలయల్లో పనిచేసే అందరు ఉద్యోగులు గ్రామ సభల్లో ప్రజలు అధికసంఖ్యంలో పాల్గొనేలా చేసి సభలు విజయవంతానికి కృషి చేయాలని కోరారు. అదే విధంగా 2024-25 ఆర్ధిక సంవత్సరంలో చేపట్టనున్న ఉపాధిహామీ పనులకు సంబంధించి గ్రామ సభలో చర్చించి గ్రామ సభ ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

కొంత మంది డ్వామా పీడీలు గ్రామాలను సందర్శిచడం లేదని పని ప్రదేశాలను తనిఖీ చేయడం లేదని, సోషల్ ఆడిట్ సభలకు హాజరు కావడం లేదని కింది స్థాయి అధికారులపై నియంత్రణ లేదన్న కొన్ని వాస్తవాలు తన దృష్టికి వచ్చాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు. క్లస్టర్ స్థాయిలో పనిచేసే ఏపీడీలు పని ప్రదేశాలకు వెళ్ళడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని ఇక మీదట అలాంటి విధానాలను మార్చుకోవాలని సూచించారు. అంతేగాక మండల స్థాయిలో పథకం అమలులో పూర్తి బాధ్యత వహించాల్సిన ఎంపీడీవోలు ఇది మనపని కాదన్నట్టు వ్యవహరించడం… కేవలం సంతకాలకే పరిమితం కావడం, పని ప్రదేశంలో మస్టర్లు, తనిఖీ చేయకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయని అలాంటి వారిని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పనికి సంబంధించిన రిజిష్టర్లు, వర్క్ ఫైల్స్ చాలా మండలాల్లో సరిగ్గా నిర్వహించడం లేదని, ఇక మీదట ఎంపీడీవోలు పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే, ఏపీవోలు, ఈసీలు, టీఏలు తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని చాలా ఫిర్యాదులు ఉన్నయన్నారు.

అవినీతి ఏస్థాయిలో జరిగినా క్షమించేది లేదని ఫీల్డ్‌ అసిస్టెంట్ స్థాయి నుండి పీడీ వరకూ సోషల్ ఆడిట్ గ్రామ స్థాయి ఆడిటర్ నుండి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ వరకూ ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో బాధ్యతాయుతంగా సమర్ధవంతంగా పనిచేసే అధికారులు, సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహిస్తామని చెప్పారు.

ఈసమావేశంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్ కు డ్వామా పీడీలు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. ఈనెల 23 నుండి జరిగే ప్రత్యేక గ్రామ సభల్లో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, రీచార్జి పిట్ ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకుడు కృష్ణ తేజ్, ఇఎన్‌సీలు బాలూ నాయక్, సంజీవ రెడ్డి, వాటర్ షెడ్ డైరెక్టర్ పీవీఆర్‌ఎం రెడ్డి, అదనపు కమిషనర్ సుధాకర్ రావు, జాయింట్ కమిషనర్ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.