Mahanaadu-Logo-PNG-Large

రాష్ట్రంలో జగన్‌ సహకారంతో మేఘా దోపిడీ

-సీఆర్‌డీఏ సామగ్రి విశాఖకు తరలింపు సిగ్గుచేటు
-హైడ్రో పవర్‌లోనూ రూ.1500 కోట్ల లబ్ధికి యత్నం
-కూటమి వచ్చాక వాటిపై విచారణ జరిపిస్తాం
-బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌

అమరావతి, మహానాడు: రాజధాని అమరావతి నిర్మాణానికి సీఆర్‌డీఏ పరిధిలోని ఎలక్ట్రికల్‌ పనులకు సంబంధించిన అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌, ఇతర సామగ్రిని సీఆర్‌డీఏ అనుమతి లేకుం డానే మెగా ఇంజినీరింగ్‌ సంస్థ విశాఖపట్నంకు తరలించి అక్కడి నుంచి తిప్పి పంపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వాటిని సరఫరా చేసి సొమ్ము చేసుకున్న కంపె నీలు జగన్‌ సహకారంతో ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప మరో ఉద్దేశం లేదని విమర్శించారు.

అమరావతే రాజధాని అని చెప్పాక కూడా అమరావతి అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ ఇలా అక్రమంగా తరలిస్తున్నారంటే అవినీతి కోసం ఎంత విచ్చల విడిగా బరితెగించారో అర్థమవుతుందని మండిపడ్డారు. పోలవరం, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌, వెలిగొండ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో విఫలమైన మేఘా ఇంజినీరింగ్‌కు వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అనేక ప్రాజెక్టులను అక్రమంగా కట్టబెట్టి నష్టం చేకూర్చారని దుయ్యబట్టారు. మరోవంక పోలవరం ప్రాజెక్టు దగ్గర 960 మెగావాట్ల హైడ్రో పవర్‌ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ సకాలంలో పూర్తి చేయకుండా, మరో ఏడాది గడువు పెంచుకోవడం ద్వారా దాదాపు 1500 కోట్లు అయాచిత లబ్ధి కోసం ప్రణాళిక వేయగా పీపీఏ నుంచి అనుమతులు రాలేదు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రారంభమైన మేఘా దోపిడీ చివరకు రాజధాని అమరావతి కేబుల్‌ వరకు ఐదేళ్లుగా కొనసాగుతుందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చి రాష్ట్రానికి నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.