మేం అలగడమేంటి?

– అబ్బే.. అలగ లేదు
– అమ్మ వారి భక్తులం.. ఎందుకు అలుగుతాము?
– మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: భాగ్య నగరం లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ప్రోటోకాల్ రగడ నెలకొనడంతో నానా రచ్చ జరిగినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లినప్పుడు ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించ లేదని పొన్నం ప్రభాకర్ దంపతులు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి లు అలక బూనారు.

అంతేకాదు ఆలయం బయట అరుగు మీదే కూర్చుండి పోయారు. ఈ క్రమంలో అధికారులపై అసహనం, కోపంతో మంత్రి ఊగిపోయారనే టాక్ కూడా నడిచింది. అయితే అసలేం జరిగిందనే దానిపై మంత్రి, మేయర్ ఇద్దరూ ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు.
తాను అలిగినట్లు వస్తున్న వార్తలను పొన్నం ప్రభాకర్ ఖండించారు.. ‘నేను అలగలేదు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగింది. మేయర్ విజయలక్ష్మి కూడా తోపులాటలో ఇబ్బంది పడ్డారు. తోపులాట నిలువరించేందుకు కొద్దిసేపు ఆగి అధికారులతో మాట్లాడాం. తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించాం.

అమ్మ వారి భక్తులం ఎందుకు అలుగుతాము?. మహిళా రిపోర్టర్‌కు ఎదురైన చేదు అనుభవానికి క్షమాపణ చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం’ అని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు..

ఇదే ఘటనపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా స్పందించారు.. ‘మా ప్రభుత్వంలో మాపై మేము ఎందుకు అలుగుతాము..? తోపులాట వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నామని బయటే ఆగాం. అధికారులతో మాట్లాడి క్రౌడ్ మేనేజ్ చేయించాం. అమ్మ వారి ముందు అలగడం ఉండదు’ అని విజయలక్ష్మి ఘటనపై వివరించారు.