Mahanaadu-Logo-PNG-Large

మేరునగధీరుడు రామోజీ రావు

 -రామోజీరావుది మహాభినిష్క్రమణే
-రామోజీరావు లాంటి విశిష్ట వ్యక్తిని ఆరు నెలల క్రితం కలిశా

-అరగంట సమయం ఇచ్చి రెండు గంటలపాటు నాతో మాట్లాడారు
-నా జీవితంలో ఆ రెండు గంటల సమయం మర్చిపోలేనిది… ప్రతి నిమిషం గుర్తుండిపోయేది
-జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రాక్షస పాలన అంతమయ్యిందంటే అందులో సింహభాగం రామోజీ రావు కృషేనడంలో అతిశయోక్తి లేదు
-సంస్కారి అన్నమాట రామోజీరావు కి చిన్నదవుతుంది… ఆయన గొప్పతనం గురించి మాట్లాడడానికి మాటలు రావడం లేదు
-ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలించాలని… తెలుగువారికి అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందిన రామోజీరావు
-ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల లోగానే ఈ విషాద వార్త వినాల్సి వస్తుందనుకోలేదు
-ఇంకా తెలుగు ప్రజలకు ఆయన చేసిన మేలు చాలనుకున్నారేమో… ఏమిటో మరి?
-రామోజీ రావు పై ఆయన కుటుంబ సభ్యులపై ఎన్నో అక్రమ కేసులను నమోదు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
-అయినా చలించక… ప్రభుత్వ వేధింపులకు లొంగక పోరాడిన మేరునగధీరుడు రామోజీ రావు
-సాయంత్రంలోగా రామోజీరావు పార్థివ దేహాన్ని దర్శనం చేసుకుంటాను
-ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు

ఈనాడు సంస్థల అధినేత, పెద్దలు పద్మభూషణ్ అవార్డు గ్రహీత , చెరుకూరి రామారావు గారి మహాభినిష్క్రమణ వార్తను విన్న వెంటనే మనసును కలిచి వేసిందని ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రామోజీ రావుది మహాభినిష్క్రమణే అని పిలుస్తానని ఆయన చెప్పారు. మహాభినిష్క్రమణ అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చనిపోయినప్పుడు మహాభినిష్క్రమణం అని అన్నారని పేర్కొన్నారు.

స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చనిపోయినప్పుడు కూడా ఈనాడు దినపత్రికలో మహాభినిష్క్రమణం అని పతాక శీర్షికలో వార్తా కథనాన్ని ప్రచురించారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. అది గొప్ప వారు చనిపోయినప్పుడు ఉపయోగించే పదమని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు, నాకు రామోజీరావు అంటే అంతే ఇష్టం, గౌరవం, అభిమానం అనుకోండని అన్నారు.

అంత విశిష్టమైన వ్యక్తిని కలవడమే గొప్ప అనుభూతి, ఒక తీపి జ్ఞాపకమని పేర్కొన్న ఆయన, ఆరు నెలల క్రితం రామోజీ రావు ని కలిశానని తెలిపారు. అంతకుముందు కొన్ని సందర్భాలలో కలిసినప్పటికీ, నిమిషం… అర నిమిషం మాత్రమే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఆరు నెలల క్రితం మాత్రం అరగంట సమయం ఇచ్చిన రామోజీ రావు , రెండు గంటలకు పైగా నాతో మాట్లాడడం జరిగిందని తెలిపారు.

వయసులో నేను ఆయన కంటే ఎంతో చిన్నవాడినైనప్పటికీ, నన్ను కూడా మీరు అంటూ సంబోధించారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేసుకున్నారు. అయ్యా మీరు నన్ను దయచేసి మీరు అని సంబోధించవద్దని కోరగా, ఆయన వయస్సును బట్టి గౌరవ మర్యాదలు దక్కవని సున్నితంగా నా మాటను తిరస్కరించి నన్ను మీరు అంటూ అసాంతం సంబోధిస్తూనే ఉన్నారన్నారు.

జగన్మోహన్ రెడ్డి అవినీతి, అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేసిన రామోజీ రావు గారు
జగన్మోహన్ రెడ్డి అవినీతి, అక్రమాలపై రామోజీ రావు అలుపెరుగని పోరాటం చేశారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన అంతమయ్యిందంటే అందులో సింహభాగం , ఈ ప్రభుత్వ అవినీతిని తూర్పారబట్టిన రామోజీరావు కారణమని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. అటువంటి మహానుభావుడు నాకు తన విలువైన సమయాన్ని ఇవ్వడమే కాకుండా, వారి చిన్నతనంలోని ఎన్నో విషయాలను చెప్పారన్నారు.

మా తాత గారితో ఆయనకు ఉన్న స్నేహం గురించి వివరించారని తెలిపారు. రామోజీరావు , మా తాతగారు ఇద్దరూ మంచి స్నేహితులే కాకుండా, విజయవాడలో పక్కపక్కనే ఫ్యాక్టరీలను స్థాపించారని తెలిపారు. రామోజీ రావు తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను, రాజకీయాలలో ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ అనేక రాజకీయ అంశాల గురించి చర్చించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . నా జీవితంలో రామోజీ రావు తో గడిపిన ఆ రెండు గంటల సమయం మర్చిపోలేనిది. ప్రతి నిమిషం గుర్తుండి పోయేదని తెలిపారు .

నేను ఆయన్ని కలిసినది కొన్ని నెలల క్రితమేనని, అప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నారన్నారు. ఎంతో ఎదిగినా ఒదిగి ఉండడం అన్నది ఆయన్ని చూసి నేర్చుకోవాలన్నారు. ఎంతో ఎత్తు కు ఎదిగిన, ఎంతో గొప్ప వ్యక్తి గా కీర్తి ప్రతిష్టలను సంపాదించిన ఆయన, వయసులో తన కంటే ఎంతో చిన్నవాడినైన నన్ను లిఫ్ట్ వరకు వచ్చి సాగనంపడం అంటే… అటువంటి సంస్కారం అందరికీ ఉండదన్నారు. ఏ నూటికో, కోటికో ఒక్కరికి మాత్రమే అటువంటి సమస్కారం ఉంటుందని తెలిపారు. అటువంటి మహానుభావుడిని సంస్కారి అంటే, ఆ మాట కూడా చిన్నదే అవుతుందన్నారు. రామోజీ రావు గొప్పతనం గురించి మాట్లాడడానికి మాటలు చాలవని రఘురామకృష్ణంరాజు తెలిపారు .

ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలించాలన్న రామోజీరావు
ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించాలి రాజుగారు అని రామోజీ రావు నాతో చెప్పారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించే పనిలో ఉన్నానని చెప్పారు. రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరుగుతోందని, తెలుగు ప్రజలు దారుణంగా మోసపోతున్నారని, వారికి అన్ని విషయాలు తెలియజెప్పాలని రామోజీరావు నాతో అన్నారని రఘురామ కృష్ణంరాజు వివరించారు. ఈ క్షణం కోసమే ఎదురు చూసిన ఆయన ఇంకా తెలుగు ప్రజలకు చేసిన మేలు చాలనుకున్నారేమో, ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల్లో గానే ఈ విషాద వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదన్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రామోజీ రావు పై ఎంతో కక్ష కట్టిందని, ఎన్నో అన్యాయాలు చేసిందన్నారు. రామోజీరావు పై ఆయన కోడలు శైలజా పై కూడా ఎన్నో అక్రమ కేసులను నమోదు చేసిందన్నారు. ఏ తప్పు చేయని రామోజీరావు గారిపై, తప్పు చేస్తే చర్మం తీసే రామోజీరావు పైనే ఎన్నో అక్రమ కేసులు పెట్టినప్పటికీ చలించక , లొంగక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పోరాడిన మేరునగధీరుడు రామోజీ రావు అన్నారు.

ఆ మహానుభావుడు గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉండడం వల్ల, నేను కూడా ఢిల్లీకి రావడం జరిగిందన్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం బయల్దేరి, సాయంత్రం లోగా ఆ మహనీయుడు పార్థీవ దేహాన్ని చివరి దర్శనం చేసుకుంటానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .

ముందే సమాధి ప్రాంతాన్ని సిద్ధం చేసుకున్న రామోజీరావు
బ్రతికుండగా చావంటే ఎవరికైనా భయమేనని, ఆ చావును గుర్తు చేసుకుంటే ఇన్ని అన్యాయాలు, అరాచకాలు, అధర్మాలు, రాష్ట్రంలో, దేశంలో ఉండవని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎన్నో సంవత్సరాల క్రితమే రామోజీ రావు గారు రామోజీ ఫిలిం సిటీ లోని ఒక ప్రాంతంలో తన సమాధి ఉండాలని, ఆ ప్రాంతాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దారని తెలిపారు. వృక్షాలు అంటే అమితంగా ఇష్టపడే రామోజీరావు , సృష్టికి ప్రతి సృష్టి లాంటి రామోజీ ఫిలిం సిటీని తీర్చిదిద్దారన్నారు.

ఒక సంస్థ కాకుండా, ఒక వ్యక్తే రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రతి సృష్టిని చేయడం అనేది మామూలు విషయం కాదన్నారు. ఎన్నో వేల కోట్ల రూపాయలు నష్టపోయిన ఆయన అనుకున్న కలకు రూపం కల్పించిన శిల్పి రామోజీరావు అన్నారు. అటువంటి మహానుభావుడు ఎన్నో సంవత్సరాల క్రితమే తన సమాధి ప్రాంతాన్ని కూడా ఎంపిక చేసుకున్న విషయం తెలిసి నేను నిర్ఘాంతపోయిన . ఆ మహానుభావుడు భౌతికంగా ఇప్పుడు మన మధ్యలో లేకపోయినప్పటికీ, తప్పకుండా నాలాంటి లక్షలాదిమంది అభిమానుల గుండెల్లో శాశ్వతంగా ఉంటారన్నారు.

రామోజీ రావు లెగసిని ఆయన కుమారుడు కిరణ్ గారు, ఆయన కోడలు శైలజా కిరణ్ కొనసాగించాలని, వారికి రామోజీ రావు మనోనిబ్బరం, ధైర్య సాహసాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, రామోజీరావు కి అశ్రునయనాలతో నివాళులు అర్పిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.