- ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం
- ఎయిర్ పోర్టు వరకూ వెళ్లి చంద్రశేఖరన్ కు వీడ్కోలు పలికిన మంత్రి లోకేష్
అమరావతి: టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు సచివాలయం వచ్చిన చంద్రశేఖర్ తో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రోత్సాహకాలను ఆయనకు వివరించారు. ముఖ్యంగా ఐటి, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రెన్యువబుల్ ఎనర్జీ, టెలికమ్యూనికేషన్స్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆహార ఉత్పత్తుల రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అవసరమైన అన్నివనరులు ఉన్నాయని, ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు సహకరించే అన్నిరకాల పరిశ్రమలకు తాము మెరుగైన ప్రోత్సాహకాలు అందజేస్తామని చెప్పారు.
చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందని, ఇందుకు మీ వంతు సహాయ, సహకారాలు అందించాల్సిందిగా లోకేష్ కోరారు. మంత్రి ప్రతిపాదనలపై చంద్రశేఖరన్ స్పందిస్తూ ఎపిలో పెట్టుబడులకు తాము సుముఖంగా ఉన్నామని, పూర్తిస్థాయి ప్రతిపాదనలతో మరోమారు కలుస్తామని తెలిపారు. ముఖ్యమంత్రితో చంద్రశేఖరన్ సమావేశం అయిన అనంతరం గన్నవరం ఎయిర్ పోర్టు వరకు వెళ్లి చంద్రశేఖరన్ కు మంత్రి లోకేష్ వీడ్కోలు పలికారు.