విశాఖలో మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’

– 44వ రోజు ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ
– మంత్రిని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు

విశాఖపట్నం, మహానాడు: తన రెండు రోజుల పర్యటనలో భాగంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ విశాఖపట్నం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం జిల్లా పార్టీ కార్యాలయంలో 44వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

విశాఖవాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు

– బర్మా కాందిశీకుల భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారు, అందుకు మద్దతిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, తమకు ఆయా భూముల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని బర్మా ఆంధ్రా కాందిశీకుల కేంద్ర సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. బర్మా కాందిశీకులు, వారి సంతతి 7 వేల కుటుంబాలకు పైగా విశాఖకు తరలివచ్చాయి. తమకు ఉద్యోగం, వ్యాపార రుణాలు, ఇల్లు నిర్మించి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు.

– 2013 ఏడాది ఆర్టీసీ రిక్రూట్మెంట్ డ్రైవర్లను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ ఆర్టీసీ డ్రైవర్లు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విశాఖ రీజియన్ లో 2013లో ఎంపికైన తమను 2022లో విధుల్లోకి తీసుకున్నారు. దీంతో సర్వీసు చాలా నష్టపోయాం. గత వైసీపీ ప్రభుత్వంలో తమకు పీఆర్సీ కూడా అమలుచేయలేదు. ఉద్యోగ భద్రత లేక ఆందోళన చెందుతున్నామని, పీఆర్సీ వర్తింపజేయడంతో పాటు తమను క్రమబద్ధీకరించాలని కోరారు.

– విశాఖ భీమునిపట్నంలో మొత్తం నగదు చెల్లించి తాము కొనుగోలు చేసిన 78 సెంట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా వైసీపీ అండతో అక్రమాని వెంకటరావు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, విచారించి తగిన న్యాయం చేయాలని నకేళ్లా సోమరాజు విజ్ఞప్తి చేశారు.

– గత వైసీపీ పాలనలో చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ వార్త విని తన భర్త గుండెపోటుతో మరణించాడని, దీంతో తమ కుటుంబానికి ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కండపాలెంకు చెందిన ముచ్చకర్ల ధారాలక్ష్మి మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. వడ్డాది కేజీబీవీ నందు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

– అధికారులు చేసిన తప్పునకు న్యాయం కోసం పడిగాపులు కాస్తున్నానని విశాఖ రూరల్ కు చెందిన కె.చిన్నారావు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. 2012లో వుడా అనుమతులు ఉన్న 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాను. 1981లో సొసైటీకి దాఖలైన ఆ భూమిని 35 ఏళ్ల తర్వాత నిషేధిత జాబితాలో చేర్చారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

– ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన నగదును కుమార్తెల వివాహం కోసం అగ్రిగోల్డ్ లో పొదుపుచేశానని, సంస్థ బోర్డు తిప్పేయడంతో రోడ్డున పడ్డామని శ్రీకాకుళానికి చెందిన గంగాడ కొర్లమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి ఆధారం లేదని, తమ డిపాజిట్ తిరిగి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

– ఇంజనీరింగ్ చదివిన తనకు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని విశాఖకు చెందిన బత్తుల దుర్గా ప్రణీత్ విజ్ఞప్తి చేశారు.

– బీసీఏ కంప్యూటర్స్, ఎంబీయే చదివిన తన కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించాలని విశాఖకు చెందిన అనసూరి మధుసూదనరావు విజ్ఞప్తి చేశారు.

– షెడ్యూల్ కులానికి చెందిన తనకు రేషన్ దుకాణం మంజూరు చేసి ఆదుకోవాలని విశాఖ కంచరపాలెంకు చెందిన మోర్ల రాజారావు కోరారు.

పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ను పలువురు నాయకులు, కార్యకర్తలు కలిశారు. అనంతరం వారితో ఫోటోలు దిగారు.