– రాజధాని అమరావతికి భారీ ఆర్ధిక సాయం ప్రకటించడం సంతోషకరం
– కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో…రాజధానికి అమరావతికి భారీ ఆర్ధిక సాయం ప్రకటించడం సంతోషకరమని… పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి అభివృద్ధికి రూ. 15వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించడం అభినందనీయమన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుకు చర్యలు తీసుకోవడంపై శుభపరిణామన్నారు. అలాగే ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం గొప్ప విషయమన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం ప్రాంతాలకు నిధులు కేటాయించం ద్వారా ఆయా ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు.
సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలని నిర్ణయం హర్షనీయమన్నారు. విశాఖ- చెన్నై, బెంగళూరు-ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలు రాష్ట్రానికి భారీ స్థాయిలో నిధులు రాబట్టేలా చేశాయని పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వం ఎలా ఉంటుందో సీఎం చేసి చూపారన్నారు.