కేతిరెడ్డి- మీరూ ఓదార్చుకోండి

– కేటీఆర్‌కు మంత్రి సత్య కౌంటర్
– సత్య ఎక్స్‌ అకౌంట్‌ను బ్లాక్ చేసిన కేటీఆర్

అమరావతి: ఏపీ మంత్రి సత్యకుమార్- బీఆర్‌ఎస్‌వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదికగా కౌంటర్-ఎన్‌కౌంటర్ నడిచింది. చివరాఖరకు సత్య సంధించిన వ్యంగ్యాస్త్రాలు భరించలేక కేటీఆర్, తన ఎక్స్ అకౌంట్‌లో సత్యను బ్లాక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ‘నిరంతరం ప్రజల మధ్య ఉండే కేతిరెడ్డి లాంటి వాడు కూడా ఓడిపోవడం ఆశ్చర్యపరిచింద’న్న కేటీఆర్ వ్యాఖ్యలపై సత్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దానితో ఆగ్రహించిన కేటీఆర్ తన ఎక్స్‌లో ఆయన అకౌంట్‌ను బ్లాక్ చేశారు.

ఇంతకూ కేటీఆర్‌పై సత్య ఏం వ్యంగ్యాస్త్రం సంధించారంటే…‘‘ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు.. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే. ఫాంహౌస్‌కు పరిమితమైన మీరు ఎక్స్‌లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు. మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్‌లో నాలుగు సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియ మిత్రులు జగన్ కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు ‘సర్టిఫికేట్’ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి’’అని మంత్రి సత్యకుమార్ యాదవ్ మాజీ మంత్రి కేటీఆర్‌కు ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చారు.

కేతిరెడ్డి ఉండేది సోషల్‌మీడియాలోనే..
కాగా కేటీఆర్ వ్యాఖ్యలపై ఒక్క ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే-మంత్రి సత్యకుమార్ మాత్రమే కాదు.. నియోజకవర్గ ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేతిరెడ్డి నిజంగా ప్రజల్లో నిరంతరం ఉండేట్టయితే ఆయన ఎందుకు ఓడిపోతారు? బహుశా కేటీఆర్.. కేతిరెడ్డి ‘గుడ్‌మార్నింగ్ ధర్మవరం’ వీడియోలు ఫాలో అయి అలా చెప్పారేమో? ఆయన యాక్టివ్‌గా ఉండేది ప్రజల్లో కాదు. సోషల్‌మీడియాలో. అదంతా డైలీ సీరియల్. కేతిరెడ్డి యాక్టింగ్ ముందు సినిమా యాక్టర్లు కూడా పనికిరారు. తెలంగాణలో కేసీఆర్ ఎంత అభివృద్ధి చేశారో, మా ధర్మవరంలో కేతిరెడ్డి కూడా అంతే అభివృద్ధి చేశారని ధర్మవరం ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్‌మీడియాను నమ్ముకుంటే మీకు, కేతిరెడ్డిలాగే పరాజయం తప్పదని అదే సోషల్‌మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు.