-మంగళగిరి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
-చిన్నారి మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు
మంగళగిరి , మహానాడు: కళ్లముందే తల్లడిల్లిపోతున్న క్షతగాత్రులను చూసి చలించిపోయారు ఆ మంత్రి. నిత్యం బిజీగా ఉండే ఆ మంత్రి తన దారిన తాను వెళ్లిపోకుండా విలవిల్లాడిపోతున్న వారిని ఓదార్చారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి బీసీవై పార్టీ కార్యాలయం ఎదురుగా ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నబిడ్డ అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్ల ముందే కన్నబిడ్డ చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లింది. అటువైపుగా వెళుతున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ వెంటనే అక్కడకు చేరుకొని, గాయపడిన వారిని ఆటోలో నుంచి బయటకు తీశారు. బాబు చనిపోయాడు అంటూ విలవిలలాడుతున్న దంపతులను ఓదార్చారు. ఆటోలో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీసి, ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని మానవతను చాటుకున్నారు మంత్రి సవితమ్మ.