గాయపడిన బాధితులను పరామర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్

-మెరుగైన వైద్యంతో త్వరగా కోలుకోవాలని, ధైర్యం చెప్పిన మంత్రి

కాకినాడ:  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో సోమవారం జరిగిన దీపావళి సామాగ్రి పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెంది, మరొ ఇద్దరు గాయపడటం పట్ల రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంగళవారం ఉదయం పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. వైద్యులు మెరుగైన సహాయం అందిస్తున్నారని , త్వరగా కోలుకుంటారని మంత్రి సుభాష్ ధైర్యం చెప్పారు.

అనంతరం బాధితులకు అందుతున్న వైద్య సేవలు పై ఆసుపత్రి వైద్యులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కొల్లు వెంకట కృష్ణ భార్య జయశ్రీ ను, మరో బోటు ప్రమాదంలో విద్యుత్ షాక్ తో గాయపడిన మల్లాడి శ్రీను ను మంత్రి సుభాష్ పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి తక్షణం స్పందించి బాధిత కుటుంబ సభ్యులతో గత రాత్రి టెలిఫోన్ ద్వారామాట్లాడి ధైర్యం చెప్పారు. ఆపదలో, కష్టకాలంలో ఉన్న తమకు, ఓదార్పు, ధైర్యం చెప్పిన మంత్రి సుభాష్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ… దీపావళి పండుగ నేపథ్యంలో ప్రజలు మందుగుండు సామాగ్రితో అప్రమత్తంగా ఉండాలని వుండాలని కోరారు. సంతోషంగా జరుపుకొనే దీపావళి పండుగ ఒక కుటుంబంలో విషాదం నెలకొల్పడం చాలా బాధాకరం అన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని, దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి సుభాష్ వెంట ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఇన్చార్జ్ సూపర్ రింటెండెంట్ శ్రీనివాసన్, సి ఎస్ ఆర్ ఎమ్ ఓ అనిత, జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లావణ్య, డాక్టర్ శివకుమార్, హెల్త్ ఇన్స్పెక్టర్ సువర్ణ రాజు తదితరులు ఉన్నారు.