అమరావతి: సీఆర్డీఏ పరిధిలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు భూ కేటాయింపుల అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, గనులు,ఎక్సైజ్ శాఖమంత్రి కొల్లు రవీంద్ర, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ సభ్యులుగా ఉంటారు.
కన్వీనర్గా పురపాలక శాఖ కార్యదర్శి, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయా శాఖల కార్యదర్శులు ఉండనున్నారు. గతంలో జరిగిన భూ కేటాయింపులపై సమీక్ష, కేటాయించిన భూమి వినియోగంపై అంచనా వేసి అవసరమైన మార్పులను మంత్రుల కమిటీ సూచించనుంది.
అభ్యర్థనల పరిశీలన, వివిధ రంగాలలోని ప్రపంచ స్థాయి సంస్థలను గుర్తించి అమరావతిలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించనుంది. వివిధ సంస్థల భూ కేటాయింపు పురోగతిని పర్యవేక్షించి ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు చేయనుంది.