ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష
విశాఖపట్నం , మహానాడు : రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీలతో విశాఖలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్టు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని చెప్పారు. గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అనిత పేర్కొన్నారు. డ్రగ్స్ సేవించినట్టు నిర్ధారించే పరికరాలు అందుబాటులో లేవని, గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పోలీసు అంటే భయం కాదు… భద్రత అనే భరోసా రావాలని అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ విషయం పరిశీలిస్తామని హోంమంత్రి అనిత చెప్పారు. పోలీసుల సరెండర్ లీవ్ లకు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు.