కార్యకర్తకు చెప్పులు తొడిగిన ఎమ్మెల్యే డాక్టర్ కొలికపూడి

బాబు సీఎం అయ్యేంతవరకూ చెప్పులు వేయనన్న కార్యకర్త శపథం
అది తెలిసి స్వయంగా ఆయనకు చెప్పులు తొడిగిన తిరువూరు ఎమ్మెల్యే డాక్టర్ కొలికపూడి
సోషల్‌మీడియాలో కొలికపూడికి ప్రశంసల వర్షం

తిరువూరు: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తాను చెప్పులు వేసుకోనంటూ శపథం చేసి.. ఐదు సంవత్సరాలుగా ఆచరించిన కార్యకర్తకు చెప్పులు తొడిగి, ఎమ్మెల్యే డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పులు వేసుకుంటానని శపథం చేసిన టీడీపీ వీరాభిమానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు మార్కెట్ లో చెప్పులు తొడిగారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే చెప్పులు వేసుకుంటానని వల్లంపట్ల ఐ టీడీపీ ఛాంపియన్ గాడిచర్ల మారేశ్వరరావు శపథం చేసుకున్నాడు. ఆయన తిరువూరులోని రైతు బజార్ లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

మంగళవారం స్వయంగా నరేష్ ను కలిసిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు.. ఆయనకు చెప్పులు తొడిగారు. గత 20సంవత్సరాల నుంచి తిరువూరులో టీడీపీ విజయం చెందటం చూడలేదని, కొలికపూడి రాకతో తిరువూరులో టీడీపీ జెండా రెపరెపలాడిందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పట్టుకొని నరేష్ భావోద్వేగానికి గురయ్యాడు.

ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే కొలికపూడి గొప్ప హృదయాన్ని పార్టీ కార్యకర్తలే కాకుండా, సాధారణ నెటిజన్లు కూడా అభినందించారు.

‘‘తన స్థాయి-హోదా కూడా మరిచి, పార్టీ కోసం పనిచేస్తున్న ఒక సైనికుడి కాళ్లకు చెప్పులు తొడిగిన కొలికిపూడి మాత్రమే అసలు సిసలు పార్టీ సేనాని. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆయనను ఆదర్శంగా తీసుకుంటేఐ పార్టీ కార్యకర్తకు ఆత్మగౌరవంతోపాటు మళ్లీ ఊపిరి వస్తుంది’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.