దేవాపురంలో పర్యటించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

శుక్రవారం అర్థరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్న ప్రాంతాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి పర్యటించడం జరిగింది. శనివారం ఉదయం దేవాపురంలో ఎమ్మెల్యే పర్యటించారు.తొలుత దేవాపురం 5వ లైన్ లోని పీకలవాగు గోడకు ఆనుకొని ఉన్న 2 బడ్డికోట్లు వర్షం ధాటికి వాగులో పడిపోయి, నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిపోయాయని, వాగు మీద చెప్టా కూడా ప్రమాదకరంగా తయారయ్యింది అని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.అదేవిధంగా దేవాపురం 4వ లైన్ లో భారీగా చెత్తా కొట్టుకొని వచ్చి, చెప్టాల క్రింద నిలిచిపోవటం వలన ఆ మురుగు నీరు మొత్తం రోడ్ల మీద ప్రవహిస్తున్నదని ఎమ్మెల్యే గళ్ళా మాధవి దృష్టికి తీసుకువచ్చారు.

ఎమ్మెల్యే మాధవి అధికారులతో మాట్లాడుతూ…ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి డ్రైనేజీ, రోడ్ల మీద దృష్టి పెట్టమని పదేపదే అధికారుల చెప్పిన కూడా పెడచెవిన పెట్టిన మాదిరిగా ఈ రోజు వారీ పనితీరు కనిపిస్తున్నదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వర్షాకాలములో చాలా అప్రమత్తంగా ఉండాలని,ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అధికారులను ఆదేశించారు.పీకలవాగు వలన ప్రజలు ఇబ్బందులు ప్రాంతాల్లో అవసరమయిన సైడు గోడలు మరియు రోడ్ల నిర్మాణాలకు అవసరమయిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశించారు.