విద్యుత్ ప్రమాదంపై ఎమ్మెల్యే సీరియస్

– అధికారులతో ఫోన్ లో మాట్లాడిన సింధూర రెడ్డి

పుట్టపర్తి, మహానాడు: మున్సిపాలిటీ పరిధిలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర ఒక వ్యక్తి కరెంట్ షాక్ కు గురికావడంతో స్థానికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం నుండి బయట పడ్డాడు. ఫైబర్ నెట్ లో పనిచేసే యువకుడు బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్న కరెంటు స్తంభం వద్ద నిలిపిన తన బైక్ తియ్యడానికి వెళ్ళగా కరెంట్ షాక్ కు గురయ్యాడు. స్తంభానికి చుట్టి వదిలేసిన కరెంటు తీగ నుండి విద్యుత్ ప్రసారం అవుతుండటంతో ఆ యువకుడికి షాక్ కి గురయ్యాడు. అది గమనించిన స్థానికులు వెంటనే అతడిని కర్రతో కొట్టి ప్రాణాపాయం నుండి రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బాధితుడితో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్ అధికారులకి ఫోన్ చేసి వారిని మందలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారిని ఆదేశించారు. వర్షాకాలం కావడంతో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. వెంటనే స్పందించిన అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి డేంజర్ బోర్డును ఏర్పాటు చేశారు.