వరద బాధితులకు చేయూత

-నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

మైలవరం నియోజకవర్గంలో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కొనసాగుతూనే ఉంది. తాజాగా రామ్ కో ఇండ్రస్టీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు చేయూతనందించారు.

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పశ్చిమ ఇబ్రహీంపట్నంకు చెందిన సుమారు 700 మంది వరద బాధిత కుటుంబాలకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు నిత్యవసర వస్తువులను సోమవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన అకాల వరదల వల్ల మైలవరం నియోజకవర్గంలో ఎంతో మంది నిరాశ్రయులయ్యారన్నారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నట్లు వెల్లడించారు.

వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం విడుదల చేసిందన్నారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు రూ.25 వేలు చొప్పున చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు కూడా పంటనష్టం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 99 శాతం మందికి నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయినట్లు పేర్కొన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో అప్పట్లో అకాల వరదలు వస్తే వరద బాధితులను ఏ మాత్రం ఆదుకోలేదన్నారు. సీఎం చంద్రబాబు 74 ఏళ్ల వయసులో అర్ధరాత్రి సైతం ఇబ్రహీంపట్నంకు వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అందరినీ అప్రమత్తం చేశారని అన్నారు.

వరద బాధితులను ఆదుకుంటున్న రామ్ కో ఇండ్రస్టీస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రామ్ కో ఇండ్రస్టీస్ యాజమాన్యంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.

బాధితులను ఆదుకుంటున్న స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులకు, దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.