ఎమ్మెల్యే ప్రవర్తన దురదృష్టకరం

    • పోలింగ్ కేంద్రం వద్ద ఓటరుపై చెయ్యి చేసుకోవడాన్ని ఖండిస్తున్నాం
    • ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టేందుకు చేసిన ప్రయత్నం
    • ఓటమి ఖాయమని తెలిసి ఎమ్మెల్యే సహనం కోల్పోయారు
    • తెనాలి సంఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి
    • తెనాలి నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని పరిశీలించిన అనంతరం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ 

    ‘ప్రజాస్వామ్యంలో ఓటరే దేవుడు. అలాంటి ఓటరుని గౌరవించుకోకపోతే ఎలా? పోలింగ్ బూత్ దగ్గర స్వయానా ఓ శాసన సభ్యుడు ఓటరుపై చెయ్యి చేసుకోవడం దారుణం. తెనాలిలో జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం. ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుని ముక్తకంఠంతో ఖండిస్తున్నామ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని, లా అండ్ ఆర్డర్ తమ చేతుల్లోనే ఉంది అనుకుంటే పొరపాటన్నారు. ఓటమి ఖాయమవడంతో సహనం కోల్పోయి, ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టేందుకు స్థానిక శాసన సభ్యుడు ఆ విధంగా ప్రవర్తించారు అన్నారు. ప్రజలు కచ్చితమైన తీర్పు ఇచ్చేశారనీ, నూటికి నూరు శాతం ప్రభుత్వం మారబోతోందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో తెనాలి అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. సోమవారం తెనాలి నియోకవర్గం పరిధిలో పోలింగ్ బూత్ ల వద్ద ఎన్నికల సరళిని పరిశీలించారు.

    ఈ సందర్భంగా పోలింగ్  ముగిసిన తరవాత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి, శాసన సభ్యులు, మంత్రుల ప్రవర్తన ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసే విధంగా ఉంది. ప్రశ్నించే వారు ఎవరూ ఉండకూడదన్న మూర్ఖపు ఆలోచనతో ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండుగ అయిన ఎన్నికల ప్రక్రియని పాడు చేసే ప్రయత్నం చేశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా పాలన అందించాల్సిన వ్యక్తులే ఇలా ప్రవర్తించడం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. తెనాలిలో జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం. ఓటు విలువను గ్రహించి ఓ సామాన్యుడు ఎంతో దూరం నుంచి ప్రయాణించి మరీ వచ్చి తన హక్కుని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తే , శాసన సభ్యుడే నిస్సిగ్గుగా కులాల ప్రస్తావన తీసుకురావడం, దాడికి పాల్పడడం దారుణం. దిగిపోయే ముందు చేసిన అనవసర రాద్ధాంతం ఇది.

    ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది

    మా ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీ శ్రేణులు కవ్వించే చర్యలకు పాల్పడ్డారు. ఎంత రెచ్చగొట్టినా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులంతా సామరస్యపూర్వక వాతావరణంలో అధికారుల అనుమతులు తీసుకుని ముందుకు వెళ్లాం. తెనాలి 39, 40 వార్డుల పరిధిలో నాలుగు రోజుల ముందే అనుముతులు పొంది ఎన్నికల ప్రచారం చేసుకుంటుంటే ఉద్దేశపూర్వకంగా ఊరేగింపులు చేసి, అసాంఘిక చర్యలకు దిగుతూ భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ఓటరు సుధాకర్ పై చెయ్యి వేసిన వారిని పోలింగ్ బూత్ వద్దే ఉండడానికి పోలీసులు ఎందుకు అనుమతిచ్చారు? అసాంఘిక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని తెలిసీ పోలింగ్ బూత్ లోకి ఎందుకు అనుమతిచ్చారు. అధికారులకు ఎవరు అల్లర్లు సృష్టించేవారో తెలియదా? ఓటింగ్ సరళిని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది. ప్రజలు ఆ ప్రయత్నాన్ని తిప్పికొడతారు. ఐదేళ్ల మీ ప్రవర్తనతో ప్రజలు విసుగెత్తిపోయారు.

    తెనాలిని గంజాయికి రాజధానిగా మార్చారు. ఇన్నాళ్లు అసాంఘిక కార్యకలాపాలను పెంచి పోషించిన వైసీపీ ప్రజా ప్రతినిధి చివరికి తన నైజం బయటపెట్టుకున్నారు. ఇలాంటి వ్యక్తులకు ప్రజలే సరైన తీర్పు చెబుతారు. తెనాలి ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా పరిగణించాలి. కచ్చితంగా చర్యలు తీసుకోవాలి” అన్నారు.