ధ్రువీకరణ పత్రం అందుకున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్

అమరావతి, జూలై 8, 2024: ఎమ్మెల్యే కోటాలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా జూలై 5 న నామినేషన్ దాఖలు చేసిన పిడుగు హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు, ఎమ్మెల్సీ గా ఆయనను ఖరారు చేస్తూ రిటర్నింగ్ అధికారి ఎం. విజయ రాజు శాసన సభ కార్యాలయంలో నేడు ధ్రువీకరణ పత్రం జారీ చేసి హరిప్రసాద్ కు అందజేశారు.

పత్రికా రంగంలో సుమారు ఇరవై సంవత్సరాలకు పైగా పనిచేసిన అనుభవం ఉన్న హరి ప్రసాద్ జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరించారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తా

పి. హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. శాసన మండలి సభ్యత్వాన్ని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నాను. నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, జనసేన, టీడీపీ నాయకులకు ధన్యవాదాలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శాసన మండలి సభ్యులు పి. హరిప్రసాద్ స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. శాసన మండలి తొలి సమావేశాల ప్రారంభానికి సమయం ఉన్నందున కౌన్సిల్ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు, చర్చ, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై అధ్యయనం చేయడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, చోడిశెట్టి చంద్రశేఖర్, తాడిశెట్టి నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.