టీటీడీ లెటర్స్‌పై మండలిలో ఆసక్తికర చర్చ
అమరావతి, మహానాడు : టీటీడీ లెటర్స్‌పై మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేల మాదిరి సమానంగా చూడాలని ఎమ్మెల్సీలు లక్ష్మణ రావు, రవీంద్ర, వేంకటేశ్వరరావు కోరారు. ఇప్పటి వరకు నాలుగు రోజులు లెటర్‌కు 6 మందికి దర్శనం అనుమతి ఇచ్చారని ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. వారంలో ఆరు రోజులకు లెటర్‌కు 10 మందికి దర్శనానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీలు కోరారు. ఎమ్మెల్యేలతో సమానంగా తమకు సముచిత టీటీడీ అధికారులు గౌరవం ఇవ్వాలని ఎమ్మెల్సీలు కోరారు. ఇది పెద్దల సభ అని ఎమ్మెల్యేల కంటే ఎక్కువ అడగాలని మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు. టీటీడీ లెటర్స్ విషయంలో తాను కూడా ఇబ్బంది పడినట్టు సభలో మంత్రి ఆనం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది తన లెటర్‌కు అనుమతి ఇవ్వని అనుభవం తనకు ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. టీటీడీ లెటర్లపై సభ్యుల లేవనెత్తిన అంశంపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సమాధానం చెప్పారు.
అంతకుముందు టీటీడీలో అక్రమాలపై మండలిలో చర్చ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానం ఇచ్చారు. టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించామన్నారు. ప్రాథమిక నివేదిక వచ్చిందని.. ప్రస్తుతం విచారణ జరుగుతోందని వెల్లడించారు. పూర్తి స్థాయి నివేదిక తర్వాత అధికారులు, అనధికారులపై చర్యలు ఉంటాయన్నారు. టీటీడీలో గత ఐదేళ్లలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయని మంత్రి చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1300 కోట్లు ఆదాయం వచ్చిందని.. 1000 కోట్లు బ్యాంక్స్‌లో డిపాజిట్ చేశామని చెప్పారు. రూ.300 కోట్లు గోవిందరాజు సత్రం పునర్నిర్మాణం కోసం కేటాయించామన్నారు. ఈ పనుల్లో టెండర్లు కూడా లోపాలతో ఉన్నట్టు తెలుస్తోందని.. దేవుడి సొమ్ము దొంగలు పాలు అన్నట్టు గత పాలకుల విధానం ఉందన్నారు. స్విమ్స్, బర్డ్స్ ఆసుపత్రుల నిర్వహణ కూడా వదిలేశారని ఆరోపించారు. పవిత్ర టీటీడీలో గంజాయి, రాజకీయ నినాదాలు మార్మోగాయన్నారు.