– వచ్చే ఏడాది నుంచి టెన్త్ పాస్ కాగానే నేరుగా ఇంటర్మీడియట్ కు
– అక్కడే ఎంసెట్, నీట్ కోచింగ్
– విద్యాశాఖకు ఆదేశాలు
– సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, మహానాడు: ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్యకు ప్రథమ స్థానం ఇస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బంజారాహిల్స్ లోని కొమురంభీమ్ భవన్ లో జరిగిన బీసీ సంక్షేమ శాఖ విస్తృత స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం కలిసి దిశా నిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో గురుకులాల పనితీరుపై వారి నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ లకి మించి తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు రాబోతున్నాయని, ఇందు కోసం ఈ సంవత్సరానికి అయిదు వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. బీసీ గురుకులాలు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండాలని, ఈ సంవత్సరానికి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. అధికారుల పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. మెస్ చార్జీల పెంపు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని గ్రీన్ ఛానెల్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు అదనపు కరికులం యాక్టివిటీస్ దృష్టి సారించాలనీ సూచించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రస్తుతం మోడల్ స్కూల్ లో అమలవుతున్న మాదిరి గురుకులాల్లో కూడా పదో తరగతి ఉత్తీర్ణత కాగానే నేరుగా ఇంటర్మీడియట్ కి వెళ్ళేలా విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చారు. గురుకులాల్లో ఇంటర్మీడియట్ కంప్యూటర్ తో పాటు అన్ని కోర్స్ లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో చదువుతున్న 8,9,10 తరగతి విద్యార్థులకు రెడ్ క్రాస్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ లలో ప్రతి విద్యార్థి రెండింటిలో ఉండేలా చూడాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం సూచించారు. గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఎంసెట్, నీట్ కోచింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. దసరా సెలవుల అనంతరం ఈనెల 15 – 31 లోపు ప్రతి గురుకులాల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని వారి నుండి సలహాలు, సూచనలు తీసుకొని ఫీడ్ బ్యాక్ అందించాలన్నారు. స్టడీ సర్కిల్ల ద్వారా మోటివేషన్ స్పీచ్ ఏర్పాటు చేయాలని, రికార్డు ఆన్లైన్ క్లాస్ లు నిర్వహించాలన్నారు.
అనంతరం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం మాట్లాడుతూ విద్యార్థులు 360 రోజుల్లో 300 రోజులు మీతోనే ఉంటారని వారిని మీ సొంత పిల్లల మాదిరి చూసుకోవాలని కోరారు. నాయకత్వ ధోరణిలో బీసీ గురుకులాలు వెళ్తున్నాయని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులలకు బీసీ గురుకులాలు ఆదర్శంగా ఉన్నామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వచ్చిన తరువాత మౌలిక సదుపాయాల విషయంలో ఇబ్బందులు ఉండవన్నారు.
సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, గురుకుల సెక్రటరీ సైదులు, ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు, అడిషనల్ డెరైక్టర్ చంద్ర శేఖర్, జాయింట్ డైరెక్టర్ సంధ్య, నాయి బ్రాహ్మణ ఎండీ ఇందిరా, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.