ఏపీ కష్టాలు మోడీకి కనిపించడం లేదు

– ఏపీసీసీ చీఫ్‌ షర్మిల విమర్శ

విజయవాడ, మహానాడు: భారీ వర్షాలతో ఆంధ్రా అతలాకుతలమైందని, వరదలు ముంచెత్తాయని, అపార నష్టం సంభవించినా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించడం లేదని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల విమర్శించారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే… కొంప కొల్లేరు అయ్యింది..బెజవాడ బుడమేరు అయింది. చాలా నష్టం జరిగింది. వరదల్లో ఇప్పటికీ 35 మంది చనిపోయారు. 35 వేల ఇండ్లు నష్టపోయాయి. 5లక్షల మంది నష్టపోయారు.

ఇది ఘోర విపత్తు. ఇంత భారీ ఎత్తున విపత్తు సంభవిస్తే మోడీ కనీసం స్పందించలేదు. విజయవాడ వరదలు కేంద్రానికి కనిపించడం లేదు. ఇక్కడ ఎంపీల మద్దతుతో ప్రధాని అయ్యననే సంగతి మరిచారు. మోడీని మనం నెత్తిన పెట్టుకుంటే.. మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర విపత్తును మీరు పరిగణనలోకి తీసుకోండి. ఇది జాతీయ విపత్తు గా పరిగణించండి. నష్టపోయిన ప్రతి ఇంటికి కనీసం లక్ష సహాయం చేయండి. వస్తువులు నష్టపోయిన వాళ్లకు 50 వేలు అయినా ఇవ్వండి.

ప్రాణాలు పోయినా కుటుంబాలకు కనీసం 25 లక్షలు ఇవ్వండి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేలు ఇవ్వండి. పరిహారం వెంటనే ప్రకటించండి. చంద్రబాబు చేస్తున్న సహాయక చర్యలు సంతోషం. కానీ సహాయక చర్యలు గ్రౌండ్ లెవల్ కి చేరడం లేదు. విజయవాడ వరదలకు బుడమేరు కారణం.

2005 లో ఇలాంటి వరదలు వస్తే వైఎస్ఆర్ ఇక్కడకు వచ్చారు. బుడమేరు వరదలు రాకుండా సమస్య పరిష్కారం చేయాలని చూశారు. బుడమేరు డైవర్షన్ స్కీం కి రూపకల్పన చేశారు. బుడమేరు కాలువలు మొత్తం మూసుకు పోయాయి. నేచురల్ ఫ్లో అడ్డుకొనే విధంగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. బుడమేరు డైవర్షన్ స్కీం లో వాటర్ సిటి లోకి రాకుండా నేరుగా కృష్ణాలో కలపాలని అనుకున్నారు. ఆపరేషన్ కొల్లేరు ను క్లియర్ చేశారు. పోలవరం రైట్ కెనాల్ కి కొంత వరద కలిపారు. డైవర్షన్ స్కీం కి విద్యుత్ కేంద్రం చేయబట్టి కుదరలేదు. అయినా ఆరోజుల్లో బుడమేరు కట్టలు బలోపేతం చేశారు. కానీ గత 10 ఏళ్లలో ఆక్రమణలు జరిగాయి. తెలంగాణలో హైడ్రా మాదిరిగా బుడమేరు ఆక్రమణలు తొలగించండి.