– కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ప్రశ్న
విజయవాడ, మహానాడు: బుడమేరు, కృష్ణా నది వరదలతో ఆధ్రప్రదేశ్ కు, ప్రత్యేకించి విజయవాడ నగరానికి అపార నష్టం జరిగి నెల రోజులు అయినప్పటికీ కేంద్రం లోని మోడీ ప్రభుత్వం జాతీయ విపత్తు నిధి కింద ఒక్క రూపాయ కూడా విడుదల చేయకపోవడం శోచనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్. తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… సెప్టెంబర్ 1,2 తేదీలలో విజయవాడకు జాతీయ విపత్తు సంభవించిందని, రూ. 7600 కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. 74 మంది మృతి చెందారు. 2.82 లక్షల కుటుంబాలు, 7 లక్షల మంది బాధితులు. 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం. వేలాది కిలోమీటర్ల రోడ్లు ధ్వంసం. విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం. అనేక పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు చనిపోయాయి.
కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర అధికారులు వరద తీవ్రతను, నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
జాతీయ విపత్తు అయినప్పటికీ, నెలరోజులు అయినప్పటికీ ఒక్క పైసా కూడా జాతీయ విపత్తు నిధి క్రింద విడుదల చేయకపోవడం గర్హనీయం. వెంటనే జాతీయ విపత్తు నిధి కింద రూ.7600 కోట్లు విడుదల చేయాలి. ఇక, 18 రాజ్యాంగ సవరణలు చేసి దేశమంతటా ఒకే సారి అన్ని ఎన్నికలు (జమిలీ) జరపాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించడం పిచ్చి తుగ్లక్ నిర్ణయం. ఇది ఆచరణ సాధ్యం కాదు. ఇది క్రమేనా నియంత్రుత్వానికి దారి తీస్తుంది. సమాఖ్య వ్యవస్థకు విఘాతం. ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు తగ్గుతుంది, అభివృద్ధి పరుగులు తీస్తుంది అనడం అవివేకం. ఎన్నికల ఖర్చు బడ్జెట్ లో కేవలం 0.01 శాతం మాత్రమే.ప్రజాస్వామ్యం కోసం ఇది ఒక లెక్కలోకి రాదు. అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో జమిలీ ఎన్నికలు లేవు. అధ్యక్ష,సెనేట్, గవర్నర్, హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ , స్థానిక సంస్థలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతాయి.