వికసిత్‌ భారత్, వికసిత్ ఆంధ్రాయే మోదీ లక్ష్యం

– బీజేపీ ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌

విజయవాడ, మహానాడు: కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వికసిత ఆంధ్రప్రదేశ్ కి ఆలంబనగా ఉన్నాయని, ఏపీ లైఫ్ లైన్ పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తికి రూ.12,157 కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ‘వికసిత భారత్ – వికసిత్ ఆంధ్ర లక్ష్యంగా ప్రధాని మోడీ – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు’ అనే అంశంపైన ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఇంకా… ఆయన ఏమన్నారంటే.. కోపర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లను మంత్రివర్గ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు. ఈ రెండు పారిశ్రామిక నోడ్‌ల ద్వారా రాయలసీమలో లక్ష మంది యువత ఉద్యోగాలు పొందేందుకు ఇవి ఉపయోగపడతాయి.. రాష్ట్ర ఆత్మగౌరవ ప్రతీక అమరావతి నిర్మాణానికి బహుళ పక్ష ఏజెన్సీల ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 15,000 కోట్లు సమకూర్చడంతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందే లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు ప్రకటిస్తే, దాన్ని వాస్తవం చేయడానికి పీఎం మోడీ సహకరిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రాంతాల రోడ్, రైల్, వాటర్, ఎయిర్ రవాణా సౌకర్యాలను దొనకొండ, కనిగిరి పారిశ్రామిక వాడలకు అనుసంధానం చేస్తూ సమ్మిళిత అభివృద్ధి డ్రాఫ్ట్ ని సీఎం చంద్రబాబుకి అందించాం. ప్రకాశం జిల్లా సమ్మిళిత అభివృద్ధి డ్రాఫ్ట్ ని పరిశీలించి నివేదిక ఇవ్వమని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. భవిష్యతులో ప్రకాశం జిల్లా సమ్మిళిత అభివృద్ధి డ్రాఫ్ట్ తరహా మోడల్ ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తయారు చేసి సీఎం చంద్రబాబుకి ఇస్తాం.

పోలవరం
ఏపీ లైఫ్ లైన్ పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తికి రూ.12,157 కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం. నరేంద్ర మోదీజీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం 1.04.2014 నుండి ఇప్పటివరకు రూ. 14,419 కోట్లు విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను రాబోయే నాలుగేళ్ళలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రివర్స్‌ టెండర్ల ప్రక్రియ వల్ల ఈ ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది, ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం దృష్ట్యా డయాఫ్రం వాల్ దెబ్బతిని కేంద్ర ప్రభుత్వం పైన 1000 కోట్లు అదనపు భారం పడింది.
పోలవరం ప్రాజెక్టు వల్ల లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు, కోట్లాది ప్రజలకు మంచినీరు, పారిశ్రామిక అవసరాల కోసం నీటి సరఫరాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 960 మెగావాట్ల జలవిద్యుత్ వంటి ప్రయోజనాలు లభిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం మొదటి దశ పూర్తి అవ్వగానే రెండో దశ పూర్తికి అంచనా వేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి సమ్మతి తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ, సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో బహుళ ప్రయోజన పోలవరం ప్రాజెక్ట్ వచ్చే నాలుగేళ్ళలో పూర్తి కానుంది.

పారిశ్రామిక నోడ్‌లు
ఇది కాకుండా, దేశంలోని 12 పారిశ్రమిక నోడ్‌లలో విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ కింద కోపర్తి, బెంగళూరు-హైదరాబాద్‌ పరిధిలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లను పూర్తి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వికాసిత్ భారత్‌లో భాగంగా వికాసిత్ ఆంధ్ర కోసం, ఈ 2 స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి మొత్తం సహాయం సుమారు రూ. 5,000 కోట్లుతో అవసరమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. ఇవికాక నక్కపల్లి, మచిలీపట్టణం, దొనకొండ, ఏర్పేడు, హిందూపూర్ పారిశ్రామిక నోడులను, కనిగిరి నిమ్జ్ సమీప భవిష్యత్ లో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి అవుతాయి.

ఆంధ్రుల ఆత్మ గౌరవ ప్రతీక అమరావతి
రాష్ట్ర ఆత్మగౌరవ ప్రతీక అమరావతి నిర్మాణానికి బహుళ పక్ష ఏజెన్సీల ద్వారా రూ. 15000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి సమకూరుస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇంతకు ముందు రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు గ్రాంట్, 25 వేల కోట్ల ఔటర్ రింగ్ రోడ్, అమరావతి నుండి 20 వేల కోట్ల అనంతపురం ఎక్స్ప్రెస్ వే, విజయవాడ కోసం తూర్పు, పశ్చిమ బైపాస్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ , కనకదుర్గ ఫ్లై ఓవర్ తో పాటు అమరావతిని స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి నిధులు విడుదల చేసింది. అవసరాన్ని బట్టి రాజధాని నిర్మాణం కోసం మరిన్ని నిధులను సమకూర్చడానికి హామీ ఇచ్చారు.

రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు మొదటి అమ్మకం పైన క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు విలువ దాదాపు 25 వేల కోట్లు వరకు వుండే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా సమ్మిళిత అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకి అందించిన డ్రాఫ్ట్ ను ఈ ప్రెస్ మీట్ నోట్ కు జతపరచడమైనది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, అభివృద్ధికి కట్టుబడి ఉంది. వికసిత ఆంధ్రప్రదేశ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీకి ఉన్న శ్రద్ధకు మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమ్మిళిత సుస్థిర వృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు వినియోగిస్తారనడంలో సందేహం లేదు.