స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థగా లైకా ప్రొడక్షన్స్‌కి ఓ పేరుంది. తొలిసారి మలయాళ సినీ ఇండస్ట్రీలోకి లైకా ప్రొడక్షన్స్ ఓ భారీ బడ్జెట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రమే ఎల్2 ఎంపురాన్’. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్‌కు ఎంతో కీలకమైనదనే చెప్పాలి. దక్షిణాదిలో టాప్ యాక్టర్స్‌తో కలిసి ఓ కొత్త సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండటం విశేషం. 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎల్2 ఎంపురాన్’ రూపొందుతుంది. తొలి భాగం హిట్ కావటంతో సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో ముందుగానే అంచనా వేసిన మేకర్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించేలా సినిమాను నిర్మిస్తున్నాయి. మోహన్ లాల్, వెర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న మూడో చిత్రం కావటంతో అభిమానుల్లో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎగ్జయిట్‌మెంట్ ఇప్పటి నుంచే మొదలైంది. మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా ఎల్2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్రమ్‌గా సూపర్‌స్టార్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఖురేషి పాత్రను పరిచయం చేయటంతో లూసిఫర్ సినిమా ముగుస్తుంది. ‘ఎల్2 ఎంపురాన్’ విషయానికి వస్తే ఆ పాత్రను మరింత విస్తృతంగా ఆవిష్కరించబోతున్నారు. స్టీఫెన్ నెడుంపల్లి అసలు ఖురేషి అబ్రమ్‌గా ఎలా మారాడనే విషయాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పృథ్వీరాజ్ సుకుమార్ మోహన్‌లాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఎల్2 ఎంపురాన్’ స్టైలిష్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.