– ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
గన్నవరం, మహానాడు: రాజకీయ నాయకులు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సోమవారం సాయంత్రం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో వెంకయ్య నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యార్లగడ్డను సాదరంగా ఆహ్వానించిన వెంకయ్య నాయుడు దాదాపు గంటన్నర సేపు వారిద్దరూ వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు.
ఈ సందర్భంగా రాజకీయాల్లో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదోతెలియచేస్తూ వెంకయ్యనాయుడు ఎమ్మెల్యే యార్లగడ్డకు పలు సూచనలు ఇచ్చారు. రాజకీయాల్లో నైతిక విలువలతో పాటు మానవతా విలువలకు కట్టుబడి ఉండాలని, కులమతాలకతీతంగా ప్రభుత్వ నిబంధనలు మేరకు ప్రతి ఒక్కరికి పనులు చేసి పెట్టి మంచి పేరు సంపాదించుకోవాలన్నారు.
గత కొంతకాలంగా రాజకీయాల్లో బూతులు మాట్లాడటం ఫ్యాషన్ గా మారిందని దీన్ని ప్రజలు కూడా చిత్కరించుకున్న విషయం మొన్నటి ఎన్నికల్లో స్పష్టమైందన్నారు. అందరితో మమేకమవుతూ ముందుకు సాగితే భవిష్యత్తు ఉంటుందని వివరించారు. కమిట్మెంట్ తో పనిచేస్తే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని వెంకయ్య నాయుడు తెలిపారు.
మాతృభాష అభివృద్ధికి కృషి చేయాలని యార్లగడ్డ కు సూచించారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించటంతో పాటు, తగు సూచనలు సలహాలు ఇవ్వాలని వెంకయ్య నాయుడును యార్లగడ్డ కోరారు. యార్లగడ్డ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఆయన నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.