నవరాత్రి ఉత్సవాలపై 90 శాతంకి పైగా భక్తులు సంతృప్తి

– ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)
– క్యూ లైన్ లో భ‌క్తుల‌తో మాట్లాడిన ఎంపి, హోం మంత్రి అనిత‌
– స్వ‌యంగా సదుపాయాలు, సౌకర్యాల పరిశీల‌న‌

విజ‌య‌వాడ, మహనాడు: ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఇంద్ర‌కీలాద్రిపై రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స‌దుపాయాలు, ఏర్పాట్ల‌పై 90 శాతానికి పైగా భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఇంద్ర‌కీలాద్రి పై బుధ‌వారం అమ్మ‌వారిని దర్శించుకున్న త‌ర్వాత హోం మంత్రి వంగ‌ల‌పూడి అనితతో క‌లిసి కొండ దిగవ నుంచి పైవరకు ఉన్న భక్తుల క్యూ లైన్ లను పరిశీలించి వారితో మాట్లాడారు. వీరితో న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్.వి.రాజ‌శేఖ‌ర్ బాబు కూడా ఉన్నారు. భ‌క్తులతో మాట్లాడిన‌ అనంత‌రం క‌లెక్ట‌ర్ సృజ‌న, ఈవో కె.ఎస్.రామారావుకు ఎంపీ ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించారు.

కొండ‌పైన ద‌ర్శ‌నం కోసం క్యూ లైన్ లో వ‌చ్చే భ‌క్తుల‌ను ఏర్పాట్లపై, ద‌ర్శ‌న స‌మ‌యంపై ఎంపీ కేశినేని శివ‌నాథ్ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భ‌క్తుల‌తో మాట్లాడుతూ వారికి పాలు పంపిణీ చేశారు. ఇంద్రకీలాద్రి పై భక్తులకు పంపిణీ చేసే పాల కేంద్రాన్ని త‌నిఖీ చేశారు. అలాగే అమ్మ‌వారి ద‌ర్శనం చేసుకుని కింద‌కి వ‌చ్చే భ‌క్తుల‌తో మ‌హామంట‌పం ద‌గ్గ‌ర మాట్లాడి వారి అభిప్రాయాల‌ను కూడా తెలుసుకున్నారు. వ‌యోబేధం లేకుండా మ‌హిళ‌లు, వృద్దులు, యువతీయువ‌కులంద‌రీ అభిప్రాయ‌లు అడిగి తెలుసుకున్నారు.
క్యూ లైన్ లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, స‌దుపాయాలపై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేయటంపై ఎంపీ, హోం మంత్రి అనిత వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మూల న‌క్షత్రం నాడు భ‌క్తులు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతో వీఐపీ పాసులు ర‌ద్దు చేయ‌టం జ‌రిగింద‌ని భ‌క్తుల‌కి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ మాట్లాడుతూ శరన్నవరాత్రులలో అత్యంత విశేషమైన మూలా నక్షత్రం రోజు భక్తుల రద్దీని నియంత్రించేందుకు తాం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్టు తెలిపారు.

అలాగే హోం మంత్రి అనిత మాట్లాడుతూ క్యూలైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం సాఫీగా జరుగుతుందని భక్తులు తమతో స్వయంగా చెప్పడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. భ‌క్తుల‌కు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త వహించామని తెలిపారు.