– తీసుకున్న డబ్బులు ఇవ్వాలని బతిమాలితే వార్నింగులు
• రీ సర్వే జిమ్మిక్కులు.. తిప్పలు పడుతున్న భూ బాధితులు
• సమస్యల పరిష్కారానికి మంగళగిరి గ్రీవెన్స్‌కు తరలివచ్చిన అర్జీదారులు
• వినతులు స్వీకరించి.. పరిష్కారానికి కృషి చేసిన నేతలు
మంగళగిరి, మహానాడు: ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే వేమవరపు వరలక్ష్మి, ఆమె భర్త శ్రీనివాసరావులు తమను బెదిరిస్తున్నారని.. నాకు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సజ్జల, సుచరిత, నందిగామ సురేష్, విడదల రజినీలతో సాన్నిహిత్యం ఉందని చెబుతూ తమను భయపెడుతున్నారని.. ఇకపై ఇంటికొచ్చి డబ్బులు అడిగితే చంపేస్తామంటున్నారని.. కులం పేరుతో నీచంగా దూషిస్తున్నారని తమకు న్యాయం చేయాలని పిల్లి విజయకుమారి, కొట్టె ఆదిలక్ష్మిలు మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలు మాజీ మంత్రి జవహర్, పీలా గోవింద్ సత్యనారాయణ, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు స్వామిదాసులకు వినతి ఇచ్చి న్యాయం చేయాలని వేడుకున్నారు. వెంటనే నేతలు స్థానిక ఎస్పీతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించి పరిష్కరించాలని కోరారు. వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లలో వెంటనే మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు.
• కోర్టు భూమి తమదే అని చెప్పినా వైసీపీ నాయకులు ముసలప్పకుమారుడు నారాయణరెడ్డి, కృష్ణారెడ్డిలు తమ భూమి తాము రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే ఇబ్బంది పెడుతున్నారని.. బూతులు తిడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని.. వీరి నుండి రక్షణ కల్పించి న్యాయం చేయాలని పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తికి చెందిన ఎం. వీరారెడ్డి కోరారు.
• గతంలో రిజిస్ట్రర్ అయిన తమ భూమిని నేడు చుక్కల భూమిగా చూపిస్తున్నారని.. దానివలన తాము పొలం అమ్ముకోలేకపోతున్నామని తాము అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామని, తమకు ఆ పొలమే దిక్కని వెంటనే భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన శ్రీరాం వెంకటసుబ్బారావు గ్రీవెన్స్ లో నేతలను కలిసి విన్నవించారు.
• నెల్లూరు జిల్లా, దస్తగిరి మండలం బాడుగుడిపాడులో తమ తండ్రి కొనుగోలు చేసిన పొలాన్ని అధికారులే అన్యాక్రాంతం చేసి తమకు సంబంధం లేదంటున్నారని.. తాము ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని.. తమకు ఆ పొలమే ఆధారమని న్యాయం చేయాలని పర్చూరు మండలం ఉప్పుటూరుకు చెందిన శికాకొల్లిహైమనందకుమార్ నేతలకు విజ్ఞప్తి చేశారు.
• బాపట్ల జిల్లా, బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో 2013 నుండి 2018 వరకు పలు అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు నేటికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దానికి సంబంధించిన బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని ఆ ఊరి సర్పంచ్ నేతలకు అర్జీ ఇచ్చి వేడుకున్నారు.
• కృష్ణా జిల్లా, పామర్రు మండలం, రిమ్మనపూడి గ్రామానికి చెందిన తుమ్మల హరిబాబు, తుమ్మల సత్యానారాయణలు విజ్ఞప్తి చేస్తూ.. గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే వలన తమ ఆస్తులు ఒకరివి మరొకరికి మారాయని వాటిని సరిచేయాలని గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
• తాను తన చెల్లి అనాథలమని.. తల్లిదండ్రులు లేరని తమ చదువుకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన మోదుగు తేజ గ్రీవెన్స్ లో నేతలను అభ్యర్థించారు.
• కొండవీటి వాగు ఎత్తిపోతల పథకంలో భాగంగా ల్యాండ్ పూలింగ్ లో ప్రభుత్వం తీసుకున్న భూమిని పలువురు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి తాడేపల్లికి చెందిన స్థానిక నివాసి ఫిర్యాదు చేశారు.
• తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరానికి చెందిన కొండేటి బాలాజీ విజ్ఞప్తి చేస్తూ.. ప్రతిమా ఇన్ఫ్రాస్టక్షర్ ద్వారా ఇసుకను ట్రాన్స్ పోర్టు చేసిన రూ. 15 లక్షలు రావాల్సినవి అడగ్గా.. తనకు డబ్బులు ఇవ్వకుండానే అంతా సెటిల్ చేశామని చెబుతున్నారని.. తాను దివ్యాంగుడినని, తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు.